అదానీపై రాహుల్ అలా.. రేవంత్ ఇలా
జాతీయ నాయకత్వ విధానాలకు.. రాష్ట్ర ప్రభుత్వ ఆచరణకు ఆస్మాన్ ఫరక్ తేడా
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపించింది. బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఆయనతో సహా పలువురిపై కేసు నమోదు చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అదానీని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఆయనతో పాటు సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఇవే అంశంపై స్పందిచిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు బీజేపీ కట్టబెడుతున్నదని ధ్వజమెత్తారు. అదానీ లాంటి వారికి దేశ సంపదను మోడీ దోచి పెడుతున్నారని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు. ఆయన మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి అదానీ గ్రూప్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై జాతీయస్థాయిలో ఒకే విధానం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ రాష్ట్రానికో విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. రాహుల్ గాంధీ అదానీ-మోడీలపై పార్లమెంటుతో పాటు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తుంటారు. మోడీ ప్రధాని అయ్యాకే అదానీ కంపెనీలు ఆర్థికంగా బలోపేతమయ్యాయని ఆరోపిస్తున్నారు.
అయితే తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం అదానీ గ్రూప్‌ను ఇక్కడ అడుగు పెట్టనివ్వలేదు. కానీ రేవంత్ సీఎం అయి నెలరోజులు కాగానే ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గౌతమ్ అదానీ ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 12,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. చందనవెల్లిలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. రూ. 1400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్ లిమిటెడ్ 6.0 ఎంటీపీఏ సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ అదానీ ఏరో స్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి కేంద్రాల కోసం రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తుందని తెలంగాణ సీఎం వారికి హామీ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ సహా, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు. అదానీ విషయంలో రాహుల్‌గాంధీ మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందన్న మాట వాస్తవమే అయితే ఆ ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? కాంగ్రెస్ జాతీయ నాయకత్వం విధానమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తారా అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. అదానీ కంపెనీలపై కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా, రాహుల్ ఆలోచనలకు విరుద్ధంగా రాష్ట్రంలో రేవంత్ పాలన సాగిస్తున్నారని విపక్ష బీఆర్‌ఎస్ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నదా? అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం.