Telugu Global
Editor's Choice

హ్యాండ్సప్‌ సర్కారుపై ప్రస్ఫుట ప్రజాగ్రహం

రేవంత్‌ రాష్ట్ర ఇమేజ్‌తో పాటు ముఖ్యమంత్రి పదవికి మచ్చ తెస్తున్నారనేది ప్రజాభిప్రాయం

హ్యాండ్సప్‌ సర్కారుపై ప్రస్ఫుట ప్రజాగ్రహం
X

'కత్తి ఆంధ్రోడిది అయినా పొడిచేది తెలంగాణోడే' కేసీఆర్‌ అనేక సందర్భాల్లో చెప్పారు. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పధ్నాలుగు నెలల పాలన చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. ఇన్ని నెలల్లో ఆ పార్టీ మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? లేదనే సమాధానం వస్తుంది. రేవంత్‌రెడ్డికి రాజకీయంగా తన లక్ష్యం ఏమిటో స్పష్టత ఉన్నది. అందుకే ఎన్నికల్లో గెలువడానికి నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. దానికి కోదండరామ్‌, ఆకునూరి మురళి, తీన్మార్‌ మల్లన్న లాంటి వాళ్లు సపోర్టు చేశారు. కానీ ఈ ముగ్గురు కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యం అన్నట్టు వ్యవహరించారు. కానీ తెలంగాణ సమాజానికి దీర్ఘకాలంలో చాలా నష్టం చేస్తున్నామని ఏమాత్రం ఆలోచించలేదు. నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అయినదానికి కానిదానికి ఒంటికాలిపై లేచిన వాళ్లు ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.

హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పడం లేదు. కానీ ఏదీ సంపూర్ణంగా చేయకున్నా.. అన్ని పూర్తయినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న వారిని కర్కశంగా అణిచివేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యం, హక్కుల గురించి మాట్లాడిన కోదండరామ్‌ ఇప్పుడు ఎందుకు సప్పుడు చేయడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ ఏం చేసినా శాస్త్రీయంగా చేయలేదు అని అసత్య ప్రచారాలు చేసిన వీళ్లకు పధ్నాలుగు నెలల ప్రజావ్యతిరేక విధానాలు కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎటు పోయినా మాకేమీ అన్నట్టు కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తుంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని చెప్పుకున్న పెద్ద మనిషికి కాంగ్రెస్‌ పాలన గొప్పగా కనిపించడమే ఇప్పటి విషాదం.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఎలుక తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్టు రేవంత్‌ రెడ్డి తీరు మారదు అన్నది అందరం చూస్తున్నదే. అసెంబ్లీ వేదికగానే కాదు మైకు ముందుకు వస్తే అబద్ధాలు చెప్పడం, తాను అనుకున్నదని నిజమని నొక్కి చెప్పడం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారింది. దీనివల్ల రాష్ట్ర ఇమేజ్‌తో పాటు ముఖ్యమంత్రి పదవికి మచ్చ తెస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతున్నది. మార్పు కోరిన ప్రజలే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయం మాత్రమే కాదు. బక్క జడ్సన్‌ లాంటి కట్టర్‌ కాంగ్రెస్‌ వాదుల వాదన కూడా.

First Published:  6 Feb 2025 4:26 PM IST
Next Story