పవన్ సనాతన ధర్మం వాదన వెనుక
దక్షిణాదిలో విస్తరణ కోసం కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పవన్ వ్యాఖ్యలు అని రాజకీయవర్గాల్లో చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెల్లగా కాషాయపార్టీ వాదాన్ని ఎత్తుకున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా అక్కడ ఆ పార్టీ బలమెంతో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రెండో అభిప్రాయం లేదు. కానీ లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయ నినాదమైన సనాతన ధర్నం గురించి పదే పదే మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అలాగే ప్రకాశ్‌రాజ్‌పై కూడా పవన్ ఫైర్ అయ్యారు. ''నేను హిందు మతం గురించి మాట్లాడుతుంటే ఆయనకు ఏం సంబంధం? నేను వేరే మతాన్ని నిందించానా? తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదా?'' అని నిలదీశారు. అంతటితో ఆగకుండా ఒక్కొక్కరికి ఏం పిచ్చి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌రాజ్ పై గౌరవం ఉంటుందంటూనే సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. సెక్యులరిజానికి విఘాతం అని ప్రకాశ్ అనడం పై పవన్ మండిపడ్డారు. తన ఇంటిపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా? తన ఇల్లు పదిమందికి ఆశ్రయిస్తుందని.. తన సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానిపై దాడి జరిగినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్‌కే కాదు సెక్యులరిజం పేరుతో మాట్లాడుతున్న వారందరికీ పవన్ హెచ్చరిక జారీ చేశారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది ఫన్ కాదని.. లోతైన వేదన అన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయ్యప్ప మీద మాట్లాడుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. జీసస్ మీద మాట్లాడగలరా? హిందు దేవుళ్లపై జోకులు వేయడంపై పవన్ ఫైర్ అయ్యారు. దీనివల్ల మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? సనాతన ధర్మంపై దాడి జరుగుతుంటే సగటు హిందువులంతా రోడ్లపై రావాలని మేము కోరడం లేదని.. మీకు కోపం కూడా రావడం లేదా? అని ప్రశ్నించారు. గుడికి వెళ్లే హిందువు బాధ్యత కాదా? నా ఒక్కడి బాధ్యతేనా? ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మీది కాదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాళ్లందరినీ తాను గౌరవిస్తానని.. మీ మాధ్యమాల ద్వారా అదే సమయంలో సనాతన ధర్మంపై ఏదైనా మాట్లాడేముందు వందలసార్లు ఆలోచించాలని అంతేగానీ ఏది పడితే అది మాట్లాడవద్దని కోరారు.
బీజేపీ తన రాజకీయ అవసరాల రీత్యా ప్రాంతాయ పార్టీలను కలుపుకుంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించాలని ఆ పార్టీ ఎన్నడూ కోరుకోదు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే బలంగా ఉన్న పార్టీ గడిచిన పదేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ పాగా వేసింది. దక్షిణాదిలో కర్ణాటకలో ఎంట్రీ ఇచ్చిన ఆపార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో తమిళనాడులో డీఎంకేను పక్కనపెట్టి అన్నామలై ద్వారా సొంతంగా ఎదగడానికి యత్నించి విఫలమైంది. కానీ ఒడిషాలో అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఆ పార్టీ తదుపరి టార్గెట్ తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు ఏపీ అన్నది స్పష్టమే. అందుకే కూటమిలో బీజేపీ చేరడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ మాత్రమే. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పటికిప్పుడు ఏపీ విస్తరణ రాజకీయాలు మొదలుపెట్టకున్నా ఆ పార్టీ భవిష్యత్తు ఆశాకిరణం పవన్ కల్యాణ్ పరోక్ష సంకేతాలు ఇస్తున్నది. కొన్నిరోజులుగా ఆయన హిందుత్వం, సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక కాషాయ పార్టీ అధిష్టానం ఉన్నద నే వాదన వినిపిస్తున్నది.