పవన్ హిట్, రేవంత్ ఫట్
హిందుత్వం, సనాతన ధర్మం ప్రచారం చేసిన పవన్.. సొంత డబ్బా కొట్టుకున్న తెలంగాణ సీఎం
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ మెజారిటీతో గెలువగా.. మహా వికాస్ అఘాడీ ఘోరంగా దెబ్బతిన్నది. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాయుతి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయగా.. మహావికాస్ అఘాడీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావులు ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. కోటి మందికి పైగా తెలుగు వాళ్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. వీళ్లంతా బీజేపీ కూటమి వైపే నిలిచారు. ఫలితాల తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయవర్గాల్లో ఇద్దరి గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే , మరో వ్యక్తి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.
పుణె, బల్లార్‌పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ రూరల్, అర్బన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేశారు. బీజేపీ పవన్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా అక్కడ ప్రొజెక్ట్ చేసింది. ఆయన హిందుత్వం, సనాతన ధర్మంతో పాటు శివాజీ, అంబేద్కర్ ల పేర్లను తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లు ఆయన ప్రచారం పట్ల ఆకర్షితులైనట్లు ఫలితాలను చూస్తే అర్థమౌతున్నది. 'ఏక్ హై తో సేఫ్ హై (కలిసికట్టుగా ఉంటే సురక్షితంగా ఉంటా' అనే బీజేపీ నినాదం మహా మంత్రంగా మారింది. బీజేపీ లైన్‌లోనే పవన్ కొన్నిచోట్ల ఎంఐఎం వ్యతిరేకంగా ఉద్వేగపూరిత ప్రసంగాలు చేసి పవన్ హిందుత్వవాదాన్ని, సనాతన ధర్మం పరిరక్షణ గురించి ప్రస్తావించారు. పవన్ ప్రచారం చేసిన ఆరు చోట్లలో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
చంద్రాపూర్, రాజురా, వర్లీ, నాగ్‌పూర్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు ఉన్న చోట్ల రేవంత్‌తోపాటు, మంత్రులు ప్రచారం చేశారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ చేసిన ప్రచార ప్రభావం కనిపించలేదు. రెండు మూడు రోజులు ఉండి ప్రచారం చేసినా ఫలితం లేదు. అక్కడ తెలంగాణ లో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, కుల గణన, రుణమాఫీ, పది నెలల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచారు. అయినా ఓటర్లు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్12.42 శాతం ఓట్లే వచ్చాయి. మహా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 101 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 16 సీట్లలో నే గెలిచి అన్ని పార్టీలకంటే పూర్‌గా ఉన్నది.
ప్రచారంలో పవన్ కల్యాణ్ ఏపీ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కాకుండా దేశం గురించి, దేశ భద్రత గురించి, మోడీ నాయకత్వం గురించి, హిందుత్వ, సనాతన ధర్మం అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు మహాయుతి వైపు మొగ్గుచూపారు. కానీ రేవంత్‌రెడ్డి పదకొండు నెలల పాలన అట్టర్ పాప్ అయ్యారు. ఇక్కడ ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నివర్గాల ప్రజలు నిరసనబాట పట్టారు. కానీ పచ్చి అబద్ధాలతో రేవంత్ అక్కడ ప్రచారం చేసి, తనకు తానే పెద్ద నాయకుడిగా ప్రజెక్ట్ చేసుకున్నారు. ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. రేవంత్ ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరింది ఏమీ లేదు అక్కడ పార్టీకి ఉన్న పతార పోయింది. రేవంత్‌రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మొదటి నుంచి అలావాటే. ఏ వేదికపై ఏం మాట్లాడాలి అన్నది ఆయన పట్టించుకోరు. పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడినట్లే సీఎంగా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన వ్యాఖ్యలు చూసిన వాళ్లు తలపట్టుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రజలైతే అసలే ఆయన మాటలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలను చూస్తే తెలుస్తుంది.