Telugu Global
Editor's Choice

నవంబర్‌ 29 ..చరిత్రను మలుపు తిప్పిన రోజు

కేసీఆర్‌ చేపట్టిన 11 రోజుల ఆమరణదీక్ష పార్లమెంటును కదిలించింది. ఐదున్నర దశాబ్దాల స్వరాష్ట్ర కలను నిజం చేసింది.

నవంబర్‌ 29 ..చరిత్రను మలుపు తిప్పిన రోజు
X

నవంబర్‌ 26న 75 వసంతాల రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. 1857 నుంచి 1947 వరకు అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్య్ర ఉద్యమ సంగ్రామంలో అనేక కీలక ఘట్టాలను మనం నిత్యం మననం చేసుకుంటున్నాం. 1949 నవంబర్‌ 26ను రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా, న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అట్లనే నెహ్రూ1930 జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు. నాటి సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం గతంలో లేదు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2015 న నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 2015 రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125వ జయంతి సంవత్సరం కూడా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే స్వాతంత్య్ర దినోత్సవం వలె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ అనేక ముఖ్యమైన ఘట్టాలున్నాయి. అవే నవంబర్‌ 29, డిసెంబర్‌ 9 ప్రకటన, జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ తేదీలు రాగానే తెలంగాణలో ఆరేళ్ల పసి పిల్లల మొదలు ఆరవై ఏళ్ల వృద్ధుల వరకు కేసీఆర్‌ గుర్తుకు వస్తారు. తెలంగాణతో, రాష్ట్ర సాధన ఉద్యమంతో కేసీఆర్‌కు ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలతో విడదీయలేని అనుబంధంగా మార్చింది. అందుకే కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేస్తానంటున్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల దేశభక్తి మాటలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో సమైక్య చంద్రబాబు అజెండాను అమలుచేశారు.

నవంబర్‌ 29న కేసీఆర్‌ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపింది. రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడే వరకు ఒకటిగా నిలిపింది. ఈ సమరంలో తెలంగాణ ప్రజలు ఒకవైపు సమైక్యవాదులు మరోవైపు. భారత స్వాతంత్య్ర పోరాటం వలె తెలంగాణ ఉద్యమం కూడా ఐదున్నర దశాబ్దాలు గాంధీ చూపిన మార్గంలో అహింసాయుతంగా జరిగింది. అందుకే తెలంగా రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన కేసీఆర్‌ సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రాన్ని సాధించడంతొ ఆయన కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్న వారికి స్ఫూర్తి అయ్యారు. అంతెందుకు విభజనను వ్యతిరేకించిన ఏపీ నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారంటే రాష్ట్ర సాధనలో ఆయన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై 1956 నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కోసం 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 369 మంది ఉద్యమకారులను నాటి సమైక్య ప్రభుత్వం కాల్చిచంపింది. అయినా ఉద్యమం ఆగిపోలేదు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 14 చోట్ల పోటీ చేసి 10 ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. అనంతరం అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. సమైక్య పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎక్కడో ఒకచోట తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన చర్చలు, సమావేశాలు, మీటింగులు జరిగేవి. 2001 డిసెంబర్‌ 27 బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ముందే 1990 దశకంలోనే తెలంగాణ జనసభ ద్వారా మలి దశ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. దీనిపై అభ్యంతరాలు అక్కరలేదు. కానీ ఒక రాజకీయపార్టీ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం అనేది బీఆర్‌ఎస్‌తోనే మొదలైంది. అందుకే తెలంగాణ ఉద్యమం అనగానే నక్సలైట్లు, శాంతిభద్రతల సమస్యలు వంటి వాదనలకు కేసీఆర్‌ చెక్ పెట్టారు. ఉద్యమాన్ని హింసవైపు నడిపిస్తే అణిచివేయవచ్చు అనే సమైక్య పాలకుల పాచికను కేసీఆర్‌ పారనివ్వలేదు. నవంబర్‌ 29న మొదలుపెట్టిన ఆయన 11 రోజుల ఆమరణ దీక్ష పార్లమెంటును కదిలించింది. ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామనే నాటి హోం మంత్రి చిదంబరం డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి వెళ్లినా జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావం వరకు విశ్రమించకుండా వివిధ రూపాల్లో కొనసాగిన ఉద్యమం దీక్షా దివస్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే కొనసాగాయి. అందుకే తెలంగాణ ఉద్యమం అనగానే కేసీఆర్‌ నిరాహారదీక్ష, సోనియా గాంధీ సంకల్పం, సుష్మాస్వరాజ్‌ సహకారం, అమరుల త్యాగ ఫలం, సబ్బండ వర్గాల పోరాటం ఇవన్నీ గుర్తుకు వస్తాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు లేవు. ఉండకూడదు కూడా. కానీ ఉద్యమ సమయంలో రెండు కండ్ల చంద్రబాబు అజెండాలో భాగంగా ఉద్యమకారులపై రైఫిల్‌ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డికి ఉద్యమకారుడు కాలేరు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేయలేరు. ఎందుకంటే నవంబర్‌ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు . కేసీఆర్‌ దీక్ష అలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు ప్రజలందరినీ కలిపింది. రాష్ట్రాన్ని సాధించేవరకు తగ్గేదేలే లేదని నిరూపించింది.

(నేడు దీక్షా దివస్‌ )

First Published:  29 Nov 2024 3:03 PM IST
Next Story