Telugu Global
Editor's Choice

కుల సర్వేపై మంత్రుల కన్ఫ్యూజన్‌

ఎలాంటి పత్రాలు ఇవ్వొద్దన్న పొన్నం.. అవసరమైన పత్రాలు రెడీగా ఉంచుకోవాలన్న భట్టి

కుల సర్వేపై మంత్రుల కన్ఫ్యూజన్‌
X

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై మంత్రుల్లోనే కన్ఫ్యూజన్‌ నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కుల సర్వేను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సర్వే సంబంధంగా ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అసవరం లేదని, జిరాక్సులు కూడా ఇవ్వొద్దని సూచించారు. ఆధార్‌ వివరాలు ఇవ్వాలా లేదా అన్నది ఆప్షన్‌ మాత్రమేనని తెలిపారు. అంటే ఆధార్‌ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వాళ్లను సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లు ఏమాత్రం ఒత్తిడి చేయబోరన్న సంకేతాలను పొన్నం ఇచ్చారు. కుల సర్వే సంబంధంగా ప్రభుత్వం సేకరించే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని, ఏ ఒక్కరి వివరాలు బయటికి రాబోవని తెలిపారు. మంత్రి పొన్నం చెప్పిన దానికి పరస్పర విరుద్ధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కుల గణనపై బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం.. సర్వేకు అవసరమైన పత్రాలన్నీ ఆయా కుటుంబాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తులు, అప్పుల లాంటి కీలక వివరాలన్నీ ఈ సర్వే సంబంధంగా ప్రభుత్వం సేకరిస్తోంది. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆధారంగా ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని బాహాటంగానే చెప్తోంది. ప్రజల ఆస్తులు, అప్పుల వివరాలు సేకరించి ప్రభుత్వం ఏం చేస్తుందన్న సందేహం ప్రజల్లో ఉంది. దీంతో సర్వే సందర్భంగా ఏం చెప్పాలి.. ఏం చెప్పొద్దు అని తమ సన్నిహితులతో చర్చించుకుంటున్నారు. ఈ వివరాలన్నీ సేకరిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గుర్తించే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధార్‌ వివరాలు ఇవ్వడం ఆప్షనల్‌ అని.. ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరి ఇంటి గుట్టు తెలుసుకోవడమే ధ్యేయంగా తాము సర్వే చేయిస్తున్నామనే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి చెప్పకనే చెప్పారు.

రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య పరమైన స్థితిగతులు అధ్యయనం చేయడానికి సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఈ సర్వే లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంటోంది. ఇంతవరకు మంచిదే.. కానీ ఆ సర్వే పేరుతో ప్రజల నుంచి సేకరించే వివరాలు మాత్రం అభ్యంతకరంగానే ఉన్నాయి. సర్వేలో భాగంగా కుటుంబంలో ఎంత మంది ఉంటారు.. ఏం చదువుకున్నారు సహా ఇతర సాధారణ వివరాలు సేకరిస్తే ప్రజలకూ పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కుటుంబానికి ఉన్న భూములు, ఆస్తుల వివరాలు సేకరించి ఏం చేస్తారనే అనుమానం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఆ కుటుంబానికి ఉన్న భూముల్లో పట్టా భూములు, అసైన్డ్‌ భూములు, అటవీ హక్కుల చట్టం కింద హక్కులు కల్పించిన భూములు ఎన్ని ఉన్నాయి.. అందులో తరి ఎంత, మెట్ట భూమి ఎంత, నీటి పారుదల సౌకర్యం ఉందా అనే వివరాలన్నీ చెప్పితీరాలి. అలాగే ఆ కుటుంబంలో ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉంది అనే వివరాలు సేకరించి ఏం చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అధికార పార్టీలో కాకుండా ఇతర రాజకీయ పార్టీల్లో సభ్యత్వం ఉంటే ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయరా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఉన్న స్థిర చరాస్తులు, వాహనాల వివరాలు, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి అప్పులు చేశారు. ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. ఆ ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం సేకరించి ఏం చేయబోతున్నది అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దమాషాకు అనుగుణంగా కాకుండా ఇప్పుడున్న రిజర్వేషన్లకు కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లకు అదనంగా ఇంకో పది నుంచి 12 శాతం రిజర్వేషన్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ రిజర్వేషన్లు గతంలో ఉన్నవే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో గత ఎన్నికల సమయంలో వాటికి కోత పెట్టారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉంటారు.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టకున్నా.. జనాభాలో బీసీలు 56 శాతం ఉంటారనే వివరాలు బయటకు వచ్చాయి. ఆ సర్వే వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా సర్వే చేయాలని అనుకున్న ప్రజల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేయడం, వారి ఆస్తులు, అప్పుల వివరాలు అడగడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశం ఇంకేదో ఉందనే సందేహాలకు తావిస్తోంది. రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక న్యాయం కోసమే సర్వే చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.. కానీ ఆ పేరుతో ప్రతి ఇంటి గుట్టును తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేయడం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఈ వివరాలన్నీ తీసుకొని ప్రభుత్వ పథకాలను కొందరికే పరిమితం చేసే ప్రయత్నాలు ఏమైనా రేవంత్‌ సర్కార్‌ చేస్తున్నదా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఆసరా పింఛన్ల రికవరీకి ప్రయత్నించి ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ఈ ప్రభుత్వానికి.. ఈ సర్వేను అడ్డం పెట్టుకొని సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం కష్టమేమి కాదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం మంచి పరిణామమే.. శాస్త్రీయ సర్వే ద్వారా ఆ రిజర్వేషన్లకు రక్షణ కల్పించే ప్రయత్నాలు కూడా ఆహ్వానించదగ్గవే.. కానీ దానిని అడ్డం పెట్టుకుని ప్రజలకు అందుతోన్న పథకాలకు కోత పెట్టాలనే ఎత్తులు వేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు.

First Published:  6 Nov 2024 4:21 PM IST
Next Story