Telugu Global
Editor's Choice

మహాకుంభమేళా: ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధికి వరం

రూ. 7000 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు.. స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దిన యూపీ సర్కార్‌

మహాకుంభమేళా: ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధికి వరం
X

మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌కు వరంలా మారింది. ఈ ఆధ్యాత్మిక క్రతువు కోసం ప్రయాగ్‌రాజ్‌లో యూపీ ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. రోడ్లు పార్కులు, మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు, అధునాతన సీసీ టీవీ కమెరాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రయాగ్‌రాజ్‌ ను స్మార్ట్‌ సిటీగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈసారి సుమారు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్‌ మహాకుంభమేళా నిర్వహణ కోసం రూ. 7000 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేసింది.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా కోట్లాది మంది భక్తులను ఆకర్షించడమే కాదు భారీస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఒకప్పుడు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడిన ప్రయాగ్‌రాజ్‌ నివాసితులకు మహాకుంభమేళా నిర్వహణతో శాశ్వత పరిష్కారం దొరికింది. కుంభమేళా నిర్వహణ కోసం యోగీ ప్రభుత్వం నగరాన్ని భారీగా అభివృద్ధి చేసింది. ఆధునీకరించిన రవాణా వ్యవస్థ, అప్‌గ్రేడ్‌ చేసిన పారిశుద్ధ్య సౌకర్యాలు, సుందరీకరించిన ప్రజా స్థలాలు కుంభమేళా కోసం ప్రయాగ్‌ రాజ్‌లో యూపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఈ మహాకుంభమేళా కోసం ఆ రాష్ట్ర సర్కార్‌ సుమారు రూ. 7 కోట్లతో బడ్జెట్‌లో ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 కోట్ల మంది మంది హాజరవుతారని అంచనా వేసిన ప్రభుత్వం నిర్వహణ కోసం 549 ప్రాజెక్టులు చేపట్టింది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెనుమార్పులు జరిగాయని, కుంభమేలా తమకు వరంగా మారిందని ప్రయాగ్‌రాజ్‌ నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా కోసం ప్రధానంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి కొత్త ఫ్లైఓవర్లు నిర్మించారు. రోడ్ల పక్కనే ఉన్న ఆక్రమణలు తొలిగించి రోడ్లను విస్తరించారు. ట్రాఫిక్‌ను క్రమబద్థీకరించడానికి నగరంలో పెద్ద సంఖ్యలో సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు మీరట్‌-ప్రయాగ్‌రాజ్‌ను కలిపే 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను 6 లైన్ల నుంచి 8 లైన్లకు విస్తరించారు. గతంలో 3 రైల్వే స్టేషన్లు మాత్రమే ఉండేవి.ఇప్పుడు వాటిని 8కి పెంచారు.

ఈ కుంభమేళాలో నివాసితులకు, సందర్శకులకు పరిశుద్ధమైన నీరు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడంపై యూపీ సర్కార్‌ ప్రధానంగా దృష్టి సారించింది. నగరమంతటా సురక్షితమైన తాగునీటి కోసం అధునాతన వాటర్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. లక్షా యాభైవేలకు పైగా ఆధునిక తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా మొబైల్‌ పారిశ్రామిక యూనిట్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి 80-90 శాతం మురుగునీటి శుద్ధి సౌకర్యాల ఏర్పాటు పూర్తయ్యిందని వీటి కారణంగా గంగా నదిలోకి మురుగునీరు ప్రవహించడం ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు స్మార్ట్‌ సిటీ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. నగరమంతా ఎల్‌ఈడీ లైట్ల తో అలంకరించారు.సుమారు 2700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఉద్యానవనాలను, గ్రీన్‌ బెల్ట్‌ను అభివృద్ధి చేయడం వల్ల గాలి నాణ్యత మెరుగుదలపై దృష్టిపెట్టారు. అంతేకాదు ఇవి నగరానికి మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. కుంభమేళా కోసం సమగ్ర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో గణనీయమైన సదుపాయాల అభివృద్ధి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. నిర్మాణం, పారిశుద్ధ్యం, రవాణా ల్లో వేలాది ఉద్యోగాలు లభించాయి.

First Published:  16 Jan 2025 12:23 PM IST
Next Story