తెలంగాణ దశ దిశ మార్చిన కేసీఆర్ పాలన
వెల్లడించిన కేంద్ర ఆర్థిక సర్వే
60 ఏండ్ల సమైక్య పాలనలో విధ్వంసమైన తెలంగాణకు పదేళ్ల కేసీఆర్ పాలన కొత్త దశ దిశ చూపినట్టుగా కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2024 -25 ఆర్థిక సర్వేలో అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించినట్టుగా వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ 86 శాతం భూములకు సాగు భూములకు నీళ్లందుతున్నాయని తెలిపారు. పంజాబ్, హర్యానా తర్వాత నీటి యోగ్యమైన భూములకు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తోన్న రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ, చెక్ డ్యాంల నిర్మాణంతో నీటి వనరుల వినియోగం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఇంటింటికీ శుద్ధి చేస్తున్న ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నదని.. మిషన్ భగీరథ స్కీం ద్వారా ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని ఇస్తున్నారని తెలిపారు. నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ తో ఉద్యమాన్ని సాగించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే సాగు, నీటి రంగాల్లో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడానికి బాటలు వేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఇరిగేషన్ రంగంపై రూ.1.82 లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పనులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు - రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, డిండి లిఫ్ట్ స్కీంలాంటి ప్రాజెక్టులు తలపెట్టారు. జలయజ్ఞంలో భాగంగా ఆరంభించిన అనేక ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి సాగుభూములకు నీటిని అందించారు. రూ.36 వేల కోట్లతో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన ప్రాజెక్టుల నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలోనూ కేసీఆర్ ఉన్నత శిఖలకు తీసుకెళ్లారు. ఎకనామిక్ సర్వేలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని వెల్లడించారు. 88 శాతం పన్ను వసూళ్లతో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని తెలిపారు. కర్నాటక, హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వృద్ధి రేటు కొనసాగించడానికి కేసీఆర్ ప్రభుత్వం వేసిన బలమైన ఆర్థిక పునాదులే కారణం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసిన వీ హబ్ పై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా 6,376 స్టార్టప్ లు, ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేశారని తద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించారని తెలిపారు. 87 స్టార్టప్ ప్రోగ్రామ్స్ ద్వారా 7,828 మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. వీ హబ్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ లలో 75 శాతం రెండేళ్లుగా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన రోజు సాగు, తాగునీరు లేక రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలతో పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంతోనే రాష్ట్రం వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్వయం సమృద్ది సాధించవచ్చని గుర్తించిన కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఆయా రంగాలకు ఊతమిచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంపై విస్తృతంగా దృష్టి సారించి ప్రపంచంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దారు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ కు దన్నుగా నిలవడంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రైతులకు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, సమృద్ధి సాగునీరు, 24 గంటల కరెంట్ తో రైతులు నిశ్చితంగా వ్యవసాయం చేసుకున్నారు. దీంతో జీఎస్‌డీపీ గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో నిర్మించిన రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు తోడు పటిష్టమైన లా అండ్ ఆర్డర్ విశ్వనగరంగా ఎదిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వెరసి తెలంగాణ ఆర్థికంగా కొత్త శక్తిగా అవతరించింది. పదేళ్ల పాటు కేసీఆర్ శ్రమించి నిర్మించిన పునాదులను కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరుతో ధ్వంసం చేసే ప్రయత్నానికి పూనుకున్నది. ఆర్థిక సర్వేతోనైనా కాంగ్రెస్ కండ్లు తెరుచుకుంటాయో.. తమ తీరు మారేది లేదనట్టుగా అదే పద్ధతిలో ముందుకు వెళ్తుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది.