Telugu Global
Editor's Choice

'మహా' ఎన్నికల్లో జంగ్‌ సైరన్‌ మనోజ్‌ జరాంగే

మహారాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి సారథ్యం వహించిన ఈ నేత పేరు

మహా ఎన్నికల్లో జంగ్‌ సైరన్‌ మనోజ్‌ జరాంగే
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో అధికార మహాయుతి, విపక్ష మహావికాస్‌ అఘాడీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కూటములకు మహారాష్ట్ర ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి సారథ్యం వహించిన సోషల్‌ వర్కర్‌ మనోజ్‌ జరాంగే పాటిల్‌ సవాల్‌ విసురుతున్నారు. ఏడాది కిందటి వరకు ఆయన పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరాహారదీక్షతో ఛాంపియన్‌గా మారారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పేరే మారుమోగుతున్నది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో సుమారు 160 చోట్ల అభ్యర్థుల గెలుపోటములను మరాఠాలు ప్రభావితం చేయనున్నారు. రిజర్వేషన్ల కోసం మనోజ్‌ జరాంగే ఆరుసార్లు నిరాహారదీక్ష చేసి సరికొత్త నాయకుడిగా ఎదిగారు. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించిన ఆయన తర్వాత నిర్ణయాన్నిమార్చకున్నారు. ఈ ఎన్నికల్లో మరఠ్వాడా ప్రాంతంలో మనోజ్‌ ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమిని మనోజ్‌ గట్టి దెబ్బకొట్టారని వారు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్‌ అఘాఢీల గెలుపోటములను ఆయన ప్రభావితం చేస్తారని అంచనా వేస్తున్నారు.

మరఠ్వాడాలో 40, పశ్చిమ మహారాష్ట్రలో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో మనోజ్‌ జరాంగే పాటిల్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర కు 9మంది సీఎంలుగా పనిచేశారు. వారిలో 8 మంది మరాఠా వర్గానికి చెందిన వారు కాగా.. ఒకరు దళిత వర్గానికి చెందినవారు. పదేళ్ల కిందటి వరకు ఈ ప్రాంతాలు కాంగ్రెస్‌, అప్పటి ఎన్సీ పీలకు కంచుకోటలుగా ఉండేవి. 2014 తర్వాత బీజేపీ-శివసేన కూటమి వ్యూహాత్మక ఎత్తుగడలతో ఇక్కడ పాగా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మనోజ్‌ వ్యతిరేకించారు. దీంతో మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అధికార మహాయుతి కూటమి ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మహాయుతి కూటమిపై స్పష్టంగా పడింది. మరాఠాలు బలంగా ఉండే మరఠ్వాడా ప్రాంతంలో 8 లోక్‌సభ స్థానాల్లో మహాయుతి కూటమి ఒక్కటే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. గెలిచిన వారిలో ఒక్కరే మహారాష్ట్ర యేతర ఉండటం గమనార్హం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 50 శాతం మంది మరాఠాలు విజయం సాధించారు. దాదాపు 80 నియోజకవర్గాల్లో అయితే ఇప్పటివరకు మరాఠాయేతర అభ్యర్థులు గెలవలేదు. ఇప్పటివరకు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన వారిలో మరాఠా వర్గానికి చెందిన వారు 12 మంది ఉన్నారు. 90వ దశకం తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే గత ఎన్నికల్లో మనోజ్‌ జరాంగే ఎవరికీ మద్దతు ఇవ్వకపోవడంతో మహావికాస్‌ అఘాడీకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మహారాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న మరాఠాలకు బీజేపీ ద్రోహం చేసిందని మనోజ్‌ విమర్శలు చేశారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు గెలువడం తమ లక్ష్యం కాదని, రిజర్వేషన్లు సాధించి మహారాష్ట్రలో 30 మరాఠాలకు ప్రయోజనం చేకూర్చాలన్నదే తమ నేత ఆలోచన అని అందుకే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదన్న నిర్ణయం సరైనదేనని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది నవంబర్‌ 23న వెల్లడయ్యే ఫలితాల్లో తేలుతుంది.

First Published:  16 Nov 2024 3:16 PM IST
Next Story