పవన్ పుట్టి ముంచే పొత్తు
2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ 5.53 శాతం ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టిడిపి ఓటమికి కారణమైంది.
రాజకీయాల్లో పొత్తు పరస్పరం గౌరవాన్ని పెంచేలా ఉండాలి. భాగస్వామ్య పార్టీలకు ఏదో విధమైన లబ్ది చేకూరాలి. ఇందుకు భిన్నంగా చంద్రబాబుతో పొత్తు పవన్‌కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది అంతిమంగా పవన్ అసమర్థతను తెలియజేయడమే కాదు, ఆటలో అరటిపండుగా మిగిలిపోయే చందంగా పరిణమించిందని చెబుతున్నారు.
టిడిపి, బిజెపి, జనసేనల పొత్తులో, ముందు ప్రకటించిన దాని కన్నా జనసేన సీట్లు తగ్గడం పవన్‌కే కాదు, పవన్‌ను నమ్ముకొన్న నాయకులకు, రాజకీయశ్రేణులకు అవమానకరం. నిజానికి పవన్‌కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే పొత్తు అవసరం ఎక్కువ. దీన్ని గుర్తించి గౌరవప్రదమైన సీట్లు రాబట్టడంలో పవన్ విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ 5.53 శాతం ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టిడిపి ఓటమికి కారణమైంది. జనసేన బిజెపి కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. ఆనాడు 173 సీట్లలో పోటీ చేసిన బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఒక్క శాతం (0.84 శాతం) కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బిజెపితో పోలిస్తే ఇప్పటికీ జనసేన ప్రభావితశక్తి గల పార్టీ. పొత్తులో భాగంగా కనీసం 20-25 శాతం సీట్లు అడగాలి. అంటే 46 నుంచి 36 అసెంబ్లీ స్థానాలయినా జనసేనకు దక్కాలి. ఇందుకు భిన్నంగా ఇపుడు జనసేన 21 స్థానాలకు పరిమితం కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసింది.
పొత్తు ధర్మాన్ని పాటించే అలవాటు చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఇపుడు జనసేనతో పొత్తులో అది స్పష్టంగా బయటపడింది. ఎన్నికల్లో తన పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలి, తనతో పొత్తు పెట్టుకున్న పార్టీ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉండాలనే కుట్రపూరిత వైఖరి చంద్రబాబుది. దశాబ్దాలుగా బాబు అనుసరించే ఈ వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నామమాత్రంగా మిగిలిపోయింది. బిజెపి ప్రస్తుత అధిష్టానానికి ఈ సంగతి తెలియంది కాదు. కానీ, ఇపుడు ఇంతకు మించి వారు చేసేదేమి లేదు.
బిజెపి సంగతి ఎలా వున్నా జనసేనకు, ఆ పార్టీ అధినేతకు ఈ పొత్తు ఏమాత్రం మేలు చేయదు. కనుకనే కాపు సామాజిక వర్గం పవన్‌కు దూరం జరుగుతూ వైసిపికి దగ్గరవుతున్నది. ఎందుకంటే ఇపుడు కేటాయించిన 21 సీట్లలోనూ జనసేన గెలుపు కోసం టిడిపి శ్రేణులు సహకరిస్తాయన్న నమ్మకం లేదు. గత అనుభవాలను గమనిస్తే పొత్తు పెట్టుకున్న పార్టీ ఉనికిని దెబ్బతీసే కుటిల వ్యూహాల్లో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఉదాహరణకు 2009 నాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకొన్న టిఆర్‌ఎస్ పార్టీ 45 అసెంబ్లీ స్థానాల్లో, 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. చివరకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లను మాత్రమే గెలుచుకుంది. టిడిపి ఓట్లు టిఆర్‌ఎస్‌కు బదలాయింపు జరగని ఫలితమది. ఇపుడు 2024 ఎన్నికల్లో జనసేనకు ఇలాంటి దుర్గతి పట్టే ప్రమాదం పొంచి వుంది. ఈ పరిణామం జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమే కాదు, పవన్‌కళ్యాణ్ పుట్టి ముంచుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.