Telugu Global
Editor's Choice

బారికేడ్లు బద్దలు కొట్టిన అంటివి.. ఈ నిర్బంధాలెందుకు?

గ్రూప్‌ -1 అభ్యర్థుల గోడు వినే తీరికలేదా!

బారికేడ్లు బద్దలు కొట్టిన అంటివి.. ఈ నిర్బంధాలెందుకు?
X

''ఇందిరమ్మ రాజ్యంలో బారికేడ్లు బద్దలు కొట్టిన.. ప్రగతి భవన్‌ ముందున్న ఇనుప కంచెలు కూలగొట్టిన..'' ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలివి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు గవర్నర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించే అవకాశం వస్తే ఆ స్పీచ్‌ లోనూ ఇదే ముచ్చట చెప్పించారు. గణతంత్ర దినోత్సవం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్వాతంత్య్ర దినోత్సవం ... గవర్నర్‌ ముఖ్యమంత్రి ప్రసంగాల్లో ఇనుప కంచెలు కూలగొట్టినం.. బారికేడ్లు బద్దలు కొట్టినం.. ప్రజాపాలన తీసుకువచ్చినం.. ఇవి మాత్రమే ప్రధాన అంశాలు. బారికేడ్లు బద్దలు కొట్టిన ప్రజాస్వామికవాది రేవంత్‌ రెడ్డి పాలనలో నాలుగు రోజులుగా లాఠీలు వీపులు పగల గొడుతున్నయ్‌. బారికేడ్లు మళ్లీ రోడ్ల మీదికి వచ్చినయి. ప్రజలంతా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించిన సెక్రటేరియట్‌ ఇప్పుడు బారికేడ్లు, ఖాకీ వలయంగా మారిపోయింది. కాంగ్రెస్‌ రాష్ట్రంలో గద్దెనెక్కి ఇంకా ఏడాది కూడా కాలే.. అప్పుడే ఇన్ని నిర్బంధాలు ఎందుకు? గ్రూప్‌ - 1 అభ్యర్థుల విషయంలో ఎందుకింత నిరంకుశత్వం? పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వాళ్లతో కనీసం చర్చించే తీరిక కూడా ప్రభుత్వ పెద్దల్లో ఒక్కరికీ లేదా.. అలాంటప్పుడు ఇది ఎలా ప్రజాపాలన అవుతుంది? నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయాలని ఆదేశించే సీఎం, హోం మంత్రి రేవంత్‌ రెడ్డికి వారి గోడు వినడానికి కనీసం టైం లేదా?




రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్‌ అత్యంత నిరంకుశంగా వ్యవహరించాడని, ఇనుప కంచెలు వేసి పాలన సాగించాడని రేవంత్‌ రెడ్డి సహా కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా ఆరోపణలు చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సాఫీగా పాలన చేయాల్సిన కాంగ్రెస్‌ పార్టీకి రోజుకో విన్యాసం చేయాల్సిన అఘత్యం ఎందుకు పట్టింది. కేసీఆర్‌ ను ఓడించి కాంగ్రెస్‌ ను గెలిపించాలని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన నిరుద్యోగులు, యువత ఇప్పుడు ఎందుకు రేవంత్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే తమ జీవితాలు బాగు పడతాయని ఆశపడ్డోళ్లంతా ఎప్పుడు ఇందుకు ఆందోళన బాట పట్టారు. ఎందుకు నాలుగు రోజులుగా అశోక్‌ నగర్‌ ఖాకీ వలయంగా మారింది. లేడీస్‌ హాస్టళ్లలోకి చొరబడి యువతులపై దాడులు ఎందుకు? అర్ధరాత్రి వేళ అమ్మాయిలను ఠాణాల్లో నిర్బంధించాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగంలో ఏమైనా ఉందా? కాంగ్రెస్‌ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిత్యం ఏదో ఒక చోట ఎందుకు నిరసన బాట పడుతున్నారు. ధర్నా చౌక్‌ ఎందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగుతోంది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. రాజ్యాంగ పరిరక్షణే తమ ధ్యేయమంటోంది. అదే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డి మాత్రం జీవో 29తో ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు.

రేవంత్‌ రెడ్డి బారికేడ్లు బద్దలు కొట్టింది.. ఇనుప కంచెలు కూల్చేసిందే నిజమైతే ఈ రోజు గ్రూప్‌ -1 అభ్యర్థులు ఇంతలా ఆందోళనకు దిగరు. డీఎస్సీ , గ్రూప్‌ -2, ఇతర పరీక్షలను వాయిదా వేయాలని ఇదివరకు వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి ఉండరు. గోషామహల్‌ స్టేడియం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు రాత్రి వేళ నిరుద్యోగులు పాదయాత్ర చేసి ఉండరు. వారెవరి ఆందోళనను ప్రభుత్వం సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. వరుస ఆందోళనలకు జడిసి గ్రూప్‌ -2 పరీక్షలను మాత్రమే వాయిదా వేశారు. మిగతా వారి విషయంలో ఈ ప్రజాప్రభుత్వం అత్యంత నిర్దయగా, నిరంకుశంగా వ్యవహరించింది అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. నిరుద్యోగుల సమస్యనే తమ ఎజెండా అని చెప్పుకున్న ప్రొఫెసర్ కోదండరామ్‌, తీన్మార్‌ మల్లన్న, ఆకునూరి మురళి, రియాజ్‌ లాంటి వాళ్లెవరూ ఇప్పుడు నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదు. వారిపక్షం వహిస్తే పాలకులకు ఎక్కడ కోపం వస్తుందో అన్నదే వాళ్ల భయం. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇనుప బూట్లతో గ్రూప్‌ -1 అభ్యర్థుల ఆందోళనను అణచివేస్తున్నా ఏ ఒక్కరు కూడా కిక్కురు మనడం లేదు. కాంగ్రెస్‌ ను గెలిపించడం.. తాము పదవులు దక్కించుకోవడంపై ఉన్న ధ్యాస.. నిరుద్యోగుల నిజమైన ఆందోళనపై ఇసుమంతైనా లేదు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని పోలీసు బలంతో అణచేయాలని చూస్తే తాత్కాలికంగా పై చేయి సాధించవచ్చేమో కానీ.. దాని ప్రతిఫలం అనుభవించడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి.

First Published:  19 Oct 2024 12:34 PM GMT
Next Story