ఈ ద్వేషానికి అంతం లేదా?
సౌదా, ఓల్గా లాంటి వారి రచనలు చర్చకీ, పునరాలోచనకీ ప్రేరణగా నిలిచాయి. రాముడిని, కృష్ణుడిని ఆరాధించే వారూ ఆ రచనలు చదివారు. మన దగ్గర ఎక్కడా ద్వేషానికి చోటు లేదు.
రచయితల అభివ్యక్తి స్వేచ్ఛని గౌరవించే సహనం, సంస్కారం తెలుగు సమాజానికి ఉంది. కనుకనే విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షాన్ని స్వీకరించింది. అలాగే రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షాన్ని కూడా చదువుకుంది. ఈ రెండింటినీ ఇప్పటికి చదువుతున్నారు.. చర్చిస్తున్నారు. తాటకిని ఒక్క వేటున కూల్చవంటూ ఒక కవి సినిమా పాట రాశాడు. దానిని బాపు చిత్రీకరించాడు. తాటక కొందరు చెప్పినంత దుర్మార్గురాలు కాదని, ఆమె కథని బెజ్జారపు రవీందర్ ఒక నవల(తాటక)గా రాశాడు. రాముడికి సీత ఏమవుతుందంటూ ఆరుద్ర రాశారు. ఆ పుస్తకాన్నీ చదివారు.. చదువుతున్నారు. రామాయణం మీద, రాముని మీద వచ్చిన పుస్తకాలను చదువుతున్నారు.. సినిమాలు చూస్తున్నారు. మన పురాణ, ఇతిహాసాలను పునర్విశ్లేషణ చేస్తూ జరిగే చర్చలు అనేకం. సౌదా, ఓల్గా లాంటి వారి రచనలు చర్చకీ, పునరాలోచనకీ ప్రేరణగా నిలిచాయి. రాముడిని, కృష్ణుడిని ఆరాధించే వారూ ఆ రచనలు చదివారు. మన దగ్గర ఎక్కడా ద్వేషానికి చోటు లేదు. విధినిషేధాల ప్రస్తావన లేదు. మంచీచెడుల చర్చ కొనసాగుతోంది.
బ్రిటిష్‌వారు మాలపల్లిని నిషేధించారు. దానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. రచనల మీద నిషేధాలు తగవనే అవగాహన ఆలోచనాపరులైనవారందరిది. ఇది ప్రజాస్వామ్య జీవనశైలిలో భాగం. అభివ్యక్తి స్వేచ్ఛని భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించింది. ఎవరు ఏం చదవాలో, చదవకూడదో చెప్పే హక్కు ప్రభుత్వాలకు లేదు. కనుకనే సాల్మన్ రష్డీ సాటానిక్ వర్సెస్ మీద భారత ప్రభుత్వం (1988) నిషేధం విధించగానే - దానిని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక సభ నిర్వహించింది ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్. ఆ వార్తను మరునాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటిపేజీలో కవర్ చేసింది. బహుశా దేశంలోనే మొట్టమొదటి సభ అది. ఒక రచన చదవండి, చర్చించండి. అంతే తప్ప నిషేధం ఎలా సబబవుతుంది? అంతేగాక రష్దీ మీద ఫత్వా జారీ చేయడం మరీ ఘోరం. ఒక రచన చేసినందుకు ఆ మనిషి బతకడానికి వీల్లేదని ద్వేషాన్ని ప్రకటించడం అమానుషం. మధ్యయుగాల నాటి ధూర్తత్వం. ఇలా ద్వేషాన్ని రగిలించిన ఫలితమే రష్దీ మీద అమెరికాలో జరిగిన దుర్మార్గమైన దాడి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే యుగంలో సహించకూడని పాశవికతకు పరాకాష్ట ఇది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలు వర్థిల్లే నేలగా పేరొందిన అమెరికాలో, ప్రత్యేకించి రచయితకీ, కళాకారులకు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ చెంతన రష్దీ మీద హత్యాయత్నం జరిగింది.
సహనం, సమభావం గల భారతదేశం సాటానిక్ వర్సెస్ మీద నిషేధం విధించడం ఆమోదయోగ్యం కాని చర్య. ముఖ్యంగా పుస్తకం చదవకుండానే, పుస్తకంలో ఏముందో తెలియకుండానే తొందరపడి ఈ పుస్తకం మీద నిషేధం విధించింది నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం. ఇరాన్ అధినేత ఆయాతుల్లా ఖోమైనీ సాల్మన్ రష్డీ మీద ఫత్వా విధించడం ఘోరం. పుస్తకం చదవకుండానే వారు ఆ పని చేశారు. ఇక్కడ మన దేశంలోనూ ఆనాటి ముస్లింల నేతగా ప్రసిద్ధి చెందిన షాబుద్దీన్ సాటానిక్ వర్సెస్ మీద నిషేధం విధించాలని రాజీవ్‌గాంధీ మీద ఒత్తిడి చేశారు. నిషేధ ప్రకటన వెంటనే చేయకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఫలితంగా ఎలాంటి చర్చ లేకుండానే, పుస్తకంలోని విషయం, సారాంశం తెలుసుకోకుండానే నిషేధం విధించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రతీపశక్తులకు పనిముట్టు
సాటానిక్ వర్సెస్ మీద మన దగ్గర నిషేధం విధించడం ప్రతీపశక్తులకు లాభించింది. ఫలితంగా విద్వేషభావాలు పెచ్చరిల్లాయి. అయోధ్య వంటి అంశాలు చెలరేగడానికి ఊతమిచ్చాయి. కాంగ్రెస్ పాలకులు ఒక వర్గాన్ని బుజ్జగిస్తున్నారనే భావనల వ్యాప్తికి దారితీసింది. నిజానికి ఆ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. తార్కికతకు, హేతువాద చింతనకు, ప్రజాస్వామిక చర్చకు ఆస్కారం లేకుండా మనోభావాల పేరిట ఎవరు ఏమైనా మాట్లాడవచ్చనే ధోరణి చెలరేగడానికి ఈ ఉదంతం దారులు పరచింది.
ఎంతకాలం ఈ ద్వేషం
సాటానిక్ వర్సెస్ మీద నిషేధం విధించి, రష్దీ మీద ఫత్వా జారీ చేసి 34 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ద్వేషం చల్లారలేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆయన మీద పగ, ప్రతీకారాలు పెరిగాయి. రష్దీ మీద ఫత్వాను ఇరాన్ కొనసాగిస్తూనే వచ్చింది. రష్దీని చంపిన వారికి ఆరు లక్షల డాలర్లు బహుమతిగా అందిస్తామని 2016లోనూ ప్రకటించింది. ఫలితంగా రష్దీ మీద ద్వేష పూరిత భావాలు సమసిపోలేదు. కాలమే గాయాలు మాన్పుతుందంటారు. అది రష్దీ విషయంలో నిజం కాలేదు. ఆయన మీద పగబట్టిన వారి కోపం చల్లారలేదు. ఫలితంగానే రష్దీమీద జరిగిన ఈ ఘోరమైన దాడి. తను మృత్యువుతో పోరాడక తప్పని స్థితిలోకి నెట్టబడ్డాడు. నాగరిక సమాజంలో మనుషుల ద్వేషానికి అంతం లేదా? అనే ప్రశ్న మన ఎదుట నిలిచింది. రష్దీ సామాన్యమైన రచయిత కాదు. మన కాలంలోని గొప్ప రచయిత. మిడ్‌నైట్ చిల్డ్రన్ వంటి గొప్ప నవల రాశాడు రష్దీ. మన దేశంలో 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగే సందర్భంలో ఆయన మీద దాడి జరగడం ఒక విరోధాభాస. 75 ఏళ్ళ వయసులో తన సాహిత్య రచనలకు తాను అందుకున్న బహుమానం ఇది!
సాల్మన్ రష్దీ రచనలు సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాలకు అనువుగా ఉన్నాయన్న విమర్శలు లేకపోలేదు. వాటి మీద ఎంతయినా చర్చించవచ్చు. కానీ తమకు నచ్చని అభిప్రాయాల వ్యక్తీకరణ తగదనే రీతి అనంగీకారం. తాము మెచ్చని భావాలు వ్యక్తం చేసే రచయితలు, కళాకారులు ఈ ధరణి మీద ఉండటానికి వీల్లేదనే ద్వేషం చిమ్మడం అసమ్మతం. ఈ ధోరణిని అంగీకరిస్తే ఇలాతలం మీద మనుషులు మనుగడ సాగించగలరా? కళలు, సాహిత్యం, సంస్కృతి వర్థిల్లగలవా? అందుకనే నూరు పూలు వికసించనీ, వేయి భావాలు సంఘర్షించనీ అన్న మాటలే ఎవరికయినా శిరోధార్యం.