Telugu Global
Editor's Choice

హైడ్రానే అన్ని సమస్యలకు పరిష్కారమా?

హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టు మరోసారి ప్రశ్న. బుల్డోజర్‌ న్యాయంపై ఆగ్రహం

హైడ్రానే అన్ని సమస్యలకు పరిష్కారమా?
X

ఇప్పటికిప్పుడు 'బుల్డోజర్‌ న్యాయం' చేయడంపై సుప్రీంకోర్టు ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇండ్లు, ప్రైవేట్‌ ఆస్తులపై బుల్డోజర్లను పంపించే విషయంపై జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వాదనలు విన్నది. అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్‌ చర్యలను అక్టోబర్‌ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొన్నది. మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలిగింపు ఆలస్యమౌతుందన్న ప్రభుత్వ భయాలను కొట్టిపారేసింది. 'వచ్చే విచారణ వరకు మీ చర్యలను ఆపమని కోరితే మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు' అని జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, కె. వి. విశ్వనాథన్‌ వ్యాఖ్యానించారు.

చెరువుల్లో, నాలాల్లో ఆక్రమణల కూల్చివేత పేరుతో విమర్శలు ఎదుర్కొంటున్న హైడ్రా బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకముందే హైడ్రా కమిషనర్‌ స్పందించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే కోర్టుల నుంచి స్టే తెచ్చుకునే వరకు సమయం ఇవ్వమని కూడా చెప్పారు. మరి ఆ విధానాన్ని అందరికీ వర్తింపజేస్తున్నారా? అంటే అదీ లేదు. దుర్గం చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న సీఎం అన్న విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. హైడ్రా దూకుడుపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసింది. దానికి ఉన్న చట్టబ్ధతను ప్రశ్నించింది. దీనిపై కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తుందని రంగనాథ్‌ చెప్పడం, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం, దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకు రావాలని నిర్ణయించడం జరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల మేరకు పనిచేయాల్సిన ఐపీఎస్‌ అధికారి అంత నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. అలాగే రాష్ట్రంలో ఏ సమస్యల లేనట్టు అన్ని సమస్యలకు హైడ్రానే పరిష్కారం అన్నట్టు రేవంత్‌ ప్రభుత్వం చెప్పుకొస్తున్నది.

1908లో మూసీకి భారీ వరదలు వచ్చి హైదరాబాద్‌ను ముంచేసింది. నాటి పాలకులు రాచరికులైనా ప్రజల విశ్వాసాలను గౌరవించారు. ఆరో నిజాం మూసీ వరదల నుంచి తన ప్రజలను కాపాడమని పూజలు కూడా చేశారు. హైదరాబాద్‌లో వరదల ఉధృతిని తగ్గించడానికి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లకు నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్‌. ఆ తర్వాత టీడీపీ. వారి హయాంలోనే సరస్సుల, ఉద్యాన నగరంగా విలసిల్లిన హైదరాబాద్‌ ఆక్రమణలకు గురైంది. ఇదంతా చరిత్ర. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుని దానికి అనుగుణంగా మూసీలోకి వచ్చే 90 శాతం మురుగు నీరు శుద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. శుద్ధి అయిన నీటినే మూసీలోకి విడుదలయ్యేలా చర్యలు ప్రారంభించింది. ఇంకా కొన్ని ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో మూసీలోకి వెళ్లేది శుద్ధి చేసిన నీరే తప్పా మురుగు నీరు కాదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు మూసీ సుందరీకరణ చేస్తామని, నదీ పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని, అక్కడ ఇరవై నాలుగు గంటలు షాపింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అధికారంలోకి రాగానే మూసీ సుందరీకరణ కోసం వేల నుంచి లక్షా యాభై వేల కోట్లు అవసరమౌతాయని సీఎం, మంత్రులు వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో మూసీ సుందరీకరణ చేస్తే, హైడ్రా ఆక్రమణలు కూల్చివేస్తే రాష్ట్రంలో ఇక ఏ సమస్యలు ఉండవని.. ఇదే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అన్నట్టు ఏలికలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటూ ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. వారి ఆవేదనలను పరిణనలోకి తీసుకోవడం లేదు. అందుకే ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.

అయితే ప్రజల ప్రాథమిక హక్కులకు, జీవించే హక్కుకు భంగం వాటిల్లితే, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలని, దాన్ని అతిక్రమిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్న విషయం రేవంత్‌ సర్కార్‌కు 'బుల్డోజర్‌ న్యాయం'పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అర్థం కానట్టు ఉన్నది. ఈ నేపథ్యంలోనే హైడ్రా దూకుడుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? శనివారం నోటిసులు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? ఒక్క రోజు కూడా ఆగలేరా? అని ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏమిటని తాము గతంలోనే రెండు పిటిషన్లలో అడిగామని, మళ్లీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. అంతేకాదు హైడ్రా కేవలం నోడల్‌ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొన్నది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణ నగర్‌లో మహమ్మద్‌ రఫీ, గణేష్‌ కన్‌స్ట్రక్షన్‌లకు చెందిన ఆస్పత్రి భవనం కూల్చివేయడానికి కోర్టు తప్పుపట్టింది. ఈ భవనానికి సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరించాలని సెప్టెంబర్‌ 5న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్‌, హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశ్నించింది. ఈ నెల 30 వ తేదీన వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్లో హాజరై వివరణలు ఇవ్వాలని అమీన్ పూర్‌ తహసీల్దార్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌లను ఆదేశించింది.

హైడ్రాకు చట్టబద్ధత లేదని, చట్ట ప్రకారం వ్యవహరించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఉల్లంఘించారని తాజాగా కోర్టు తీర్పు ద్వారా తెలుస్తోంది. అందుకే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులు కోరి తెచ్చుకోవద్దని ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌ రావు హెచ్చరించారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీలు, తీర్పుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సీఎం తరఫున వాదిస్తున్న లాయర్లు వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అధికారులు ఏవీ ఆలోచించకుండా ముందుకు వెళ్తే భవిష్యత్తులో కాలపరీక్షకు నిలబడాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. హైదరాబాద్‌లోనే ఉన్న సకల సమస్యలకు హైడ్రానే పరిష్కారం అనే రాష్ట్ర పాలకుల మాటలే ప్రామాణికం అనుకోవద్దు. కోర్టుల ఉత్తర్వులు ఉల్లంఘించి ముందుకు వెళ్తే మూసీ సుందరీకరణ కాదు.. అన్నిరకాలుగా మునిగేది అధికారులే అని విశ్లేషకులు మాటలు వింటే మంచిది.

First Published:  28 Sept 2024 7:22 PM IST
Next Story