హస్తిన ఆప్‌దా? బీజేపీదా?
ఉత్కంఠగా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
దేశ రాజధాని ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది. ప్రధానంగా ఇండియా కూటమిలో చాలా మార్పులకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమిలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు విడిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరిని ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ తప్పుపట్టారు. తమ మద్దతు కేజ్రీవాల్‌కే అని కుంబబద్దలు కొట్టారు. ఒకవేళ ఈ ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ పతారా మరింత తగ్గుతుంది. ఎందుకంటే బీజేపీతో నేరుగా తలపడిన హర్యానాలో ఆపార్టీ ఓటమిని చవిచూసింది. మహారాష్ట్రలోనూ 101 స్థానాల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది. 1998-2013 వరకు షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీల్లో పటిష్టంగా ఉన్న ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది. అందుకే హస్తిన ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. అయితే కాంగ్రెస్‌కు పడే ఓట్ల వల్ల ఆప్ ఓట్లకు గండిపడచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక 1998లో అధికారం కోల్పోయిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2013లో అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ తర్వాత నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఎలాగైనా హస్తినను కమలం ఖాతాలో వేసుకోవాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సంక్షేమ పథకాల్లో కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్ లలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందని, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి దొరకడం లేదని విమర్శించింది. ఢిల్లీ అంటే మినీ ఇండియా. అక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు. అందుకే ఆ పార్టీ ప్రధాన నినాదాలైన హిందుత్వం, యూసీసీ, దేశ భద్రత వంటివి ప్రచారం చేయలేదు. విద్య, ఆరోగ్యం, మహిళా హక్కుల గురించే ఎక్కువగా ప్రచారం చేసింది. మోడీ 3.0 ప్రభుత్వం ప్రాంతీయపార్టీల మద్దతుతో ఏర్పడింది. మోడీ నాయకత్వం బలహీనపడిందని అనుకుంటున్న సమయంలోనే హర్యానా, మహారా ష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో మరోసారి మోడీ తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మోడీకే ఆ క్రెడిట్ దక్కుతుంది.
2013లో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలో వచ్చిన ఆప్... కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో తిరుగులేని పార్టీగా అవతరించింది. అక్కడితో ఆగకుండా ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలనే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఓటు బ్యాంక్ పెంచుకున్నది. పంజాబ్‌లో సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై భాగస్వామ్యపక్షాలే విమర్శలు ఎక్కుపెడుతున్న ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ గెలుపు కీలకం కానున్నది. ఎందుకంటే కేజ్రీవాల్ సహా పార్టీ మంత్రి, ఎంపీ లిక్కర్ స్కాం ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ఇదే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించాయి. దీన్ని అధిగమించి రెండు జాతీయపార్టీలను ఢీకొని మరోసారి హస్తినలో ఆప్ జెండా ఎగుర వేస్తే కేజ్రీవాల్ హీరో అవుతారు. ఈ గెలుపుతో ఇండియా కూటమిలో చీలిక లేదా నాయకత్వ మార్పు తథ్యం అవుతుంది. అలాగే బీజేపీకి చెక్ పడుతుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం ఉంటుంది.