Telugu Global
Editor's Choice

గెలిస్తే క్రెడిట్‌ మోడీకే.. ఓడితే మునిగేది శిండే, అజిత్‌

ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

గెలిస్తే క్రెడిట్‌ మోడీకే.. ఓడితే మునిగేది శిండే, అజిత్‌
X

మహారాష్ట్ర అసెంబ్లీల్లో ప్రధాన పోటీ మహాయుతి (బీజేపీ, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌), శివసేన ( ఏక్‌నాథ్‌ శిండే), కూటమి, మహా వికాస్‌ ఆఘాడీ (శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), ఎన్సీపీ (శరద్‌ పవార్‌), కాంగ్రెస్‌) కూటమి మధ్యే ఉన్నది. అయితే అధికార బీజేపీ ప్రచార బాధ్యలు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. అలాగే మహారాష్ట్రలోని 288 స్థానాల్లో పార్టీ మ్యానిఫెస్టో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన విధానాల ఆధారంగానే జరగవు. ఒక్క ప్రాంతంలో ఒక్కో విధమైన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పశ్చిమ మహారాష్ట్ర, మరట్వాడలో షుగర్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడి చెరుకు రైతుల, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఓట్లు కీలకం కానున్నాయి. విదర్భలో సోయాబిన్‌ పంటలు పండిస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్క జిల్లాల్లో స్థానిక అంశాల ఆధారంగా గెలుపోటములు నిర్ణయించబడుతాయి. ఇక కీలకమైన ముంబయి నగరంలో ప్రతి పార్టీకి పట్టున్నది. అందుకే అక్కడ ఏకపక్షంగా ఏ కూటమి గెలుస్తుందని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

గత ఎన్నికల్లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో అజిత్‌ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేశారు. రోజుల వ్యవధిలోనే బలనిరూపణకు ముందే ఆయన రాజీనామా చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ ముందుగా శివసేనలో చీలిక తెచ్చి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసింది. శివసేన (శిండే), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిజానికి అజిత్‌ పవార్‌ వర్గం మద్దతు అవసరమే లేదు. కానీ అయినా ఎన్సీపీలోనూ చీలక తెచ్చింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాయుతి కూటమి కంటే మహావికాస్‌ ఆఘాడీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో ప్లాన్‌ ఛేంజ్‌ చేసింది. ఇప్పటిప్పుడు తమ కూటమిలోని శివసేనను, ఎన్సీపీని వదులుకుంటే మొదటికే మోసం వస్తుందని అనుకుని అనివార్యంగా వాటితో కలిసి పనిచేస్తున్నది. అందుకే ఫడ్నవీస్‌ మాకు మెజారిటీ రాకపోవచ్చని ఇప్పటికే తేల్చిచెప్పారు. అలాగే మరో సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి కూడా పోటీ తీవ్రంగా ఉన్నా మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహాయుతి మెజారిటీ సాధిస్తే మరోసారి సీఎంగా తానే అవుతానని ఏక్‌నాథ్‌ శిండే అనుకుంటున్నారు. కానీ బీజేపీ అధిష్ఠానం ఆలోచన వేరేలా ఉన్నది. ఈసారి బీజేపీ అభ్యర్థినే సీఎం చేయాలనుకుంటున్నది. కూటమిలో ఎక్కువ సీట్లు సాధించి శిండేకు, అజిత్‌కు చెక్‌ పెట్టాలనుకుంటున్నది. అందుకే సీఎంగా మళ్లీ ఏక్‌ నాథ్‌ శిండేనే అవతారని ఎక్కడా చెప్పడం లేదు. హిందుత్వం, ఛత్రపతి శివాజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలనే మోడీ, అమిత్‌ షా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.

ఇక మహావికాస్‌ అఘాడీలో కూటమిలోనే ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ నెలకొన్నది. మహాయుతి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్‌ సహా శివసేన నేతలు ఎన్నికల ప్రచారంలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అక్కడి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కులగణనతోపాటు, ఆరు గ్యారెంటీలను ప్రస్తావిస్తున్నారు. ఉద్దవ్‌ ఠాక్రే అటు శిండే వర్గంపై, కేంద్రంపై ఫైర్‌ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నది. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అసలైన శివసేన, ఎన్సీపీ ఎవరితో తేల్చనున్నాయి. అందుకే ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ రెండు పార్టీలో చీలక రావడం వల్ల ఇద్దరి నేతలపై కొంత సానుభూతి ఉన్నది. దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని యత్నిస్తున్నారు. అలాగే తమకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయి. రాజ్‌ ఠాక్రే బీజేపీ వైపు ఉండటంతో బాల్‌ఠాక్రే అభిమానుల ఓట్లలో చీలిక వస్తుందా? అన్నది చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడీలో( కాంగ్రెస్‌ 13, శివసేనయూబీటీ 9, ఎన్సీపీఎస్పీ 8) మొత్తం 30 స్థానాలు గెలుచుకున్నది. మహాయుతిలో (బీజేపీ 9, శివసేన (శిండే) 7, ఎన్సీపీ (అజిత్‌) ఒక్క స్థానానికే పరిమితం కావడంతో 17 సీట్లకే పరిమితమైంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడానికి కారణం యూపీ, మహారాష్ట్ర లోక్‌సభ ఫలితాలే. అందుకే మహారాష్ట్ర ఎన్నికలను ప్రధాని ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్నారు. మహాయుతి గెలిస్తే కచ్చితంగా ఆ క్రెడిట్‌ ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తే తదుపరి సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి భిన్నంగా వస్తే ఎక్కువగా నష్టపోయేది ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌ పవార్‌లే. వాళ్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకే నవంబర్‌ 20న ఒకే విడుతలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

First Published:  14 Nov 2024 9:45 AM GMT
Next Story