Telugu Global
Editor's Choice

స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే ఆ ఆక్రందనలేల?

వాళ్లు కాగితాలకే పరిమితమైతే.. మీ సర్కారు వాళ్ల గుండెల్లో గునపాలెందుకు దించుతోంది

స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే ఆ ఆక్రందనలేల?
X

తెలంగాణ ప్రజల జీవితాలపైకి బుల్డోజర్లను పంపుతూ చిన్నాభిన్నం చేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ చర్యలను సమర్థించుకునేందుకు సర్కస్‌ ఫీట్లు చేస్తోంది. హైడ్రా కూల్చివేతలు కావొచ్చు.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ నిర్వాసితులు కావొచ్చు.. వాళ్ల గుండెల్లోంచి పెల్లుబికి వస్తోన్న ఆవేదన.. ఆక్రందన.. ఉక్రోషం మాటల్లో చెప్పలేనిది. ఆ ఆందోళనను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ వక్రభాష్యం చెప్పడం మంచిది కాదు. అధికార పీఠంపై ఉన్నవాళ్లు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. తాము తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌ గుర్తించిన విషయాన్ని ఇక్కడ ప్రచారం కాకుండా చూసుకోవడానికి నానా తంటాలు పడుతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. మూసీ రివర్‌ బెడ్‌ లో నివాసం ఉంటున్న వారితో పాటు నదికి ఇరువైపులా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్లను గుర్తించింది. ముసీలో మురుగు నీటికి బదులుగా స్వచ్ఛమైన నీళ్లు పారేలా చేయాలని సంకల్పించింది. ఈక్రమంలోనే ఎస్టీపీలు ఏర్పాటు చేసి మూసీలో చేరే ప్రతి చుక్క మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. 55 కి.మీ.ల పొడవునా మూసీ నదికి పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్టును రూ.16 వేల కోట్లతో తలపెట్టింది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ కూడా సిద్ధం చేసింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టు చెప్తోంది. రూ.50 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టు చేపడుతామని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తం రూ.70 వేల కోట్లకు పెరిగింది. రోజులు గడిచాయి.. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌, ఫీజిబులిటీ సర్వే లాంటివేవి చేపట్టలేదు.. కానీ నిర్మాణ వ్యయం రూ.1.50 లక్షల కోట్లకు పెంచేశారు. ఈ మూడు అంకెలు స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి గారి నుంచి నోటి నుంచి వచ్చినవే.. ''తెలంగాణ గ్రోత్‌ స్టోరీ - ద రోడ్‌ టు ట్రిలియన్ డాలర్స్‌ ఎకానమీ'' పేరుతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పబ్లిష్‌ చేసిన బుక్‌ లోనూ మూసీ రివర్‌ బ్యూటిఫికేషన్‌ రూ.1.50 లక్షల కోట్లతో చేపట్టబోతున్నట్టు ప్రచురించారు. ఈ బుక్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించడమే కాదు.. ఆయన మెసేజ్‌ తోనే బుక్‌ పబ్లిష్‌ చేశారు. అంటే మూసీ రివర్‌ ఫ్రంట్‌ కు రూ.1.50 లక్షల కోట్లు చేయడం అనేది అక్షర సత్యం అని అంగీకరించనట్టే. వేలాది కి.మీ.ల పొడవైన గంగా నదికి పునరుజ్జీవం ఇచ్చే నమామి గంగే ప్రాజెక్టుకే రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఎలా ఖర్చవుతాయో ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ సమధానం చెప్పడం లేదు. మూసీ బాధితులతో తిట్లు, శాపనార్థాలతో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించి సెక్రటేరియట్‌ లో ప్రెస్‌ మీట్‌ పెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు కూడా తమ సీఎం రేవంత్‌ రెడ్డి బ్రెయిన్‌ చైల్డ్‌ కు ఎందుకంత ఖర్చవుతుందో చెప్పే ప్రయత్నం చేయలేదు.

ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు దానికి అవసరమైన భూమి, ఆస్తులు సేకరించడానికి యూపీఏ ప్రభుత్వమే కొత్త భూసేకరణ చట్టం తీసుకువచ్చింది. దాని ప్రకారం సర్వే చేసి ఏయే భూములు, ఆస్తులు ఆయా ప్రాజెక్టు కోసం సేకరించాల్సి వస్తుందో ల్యాండ్‌ అక్విజేషన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఓపెన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. వారి డిమాండ్ల మేరకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి. తమ ఆస్తుల అప్పగింతకు ప్రజలు అంగీకరించిన తర్వాత వారిని అక్కడి నుంచి తరలించాలి. మూసీ నది గర్భంలో ఇండ్లు కట్టుకున్న వాళ్లు కావొచ్చు.. నదికి ఇరువైపులా ఇండ్లలో నివసిస్తున్న వాళ్లు కావొచ్చు.. ఎవరూ ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాలేదు. అసలు ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయకుండానే ఏకపక్షంగా బాధితులను తరలిస్తోంది. ఈ విషయం ప్రభుత్వంలోని పెద్దలకు తెలియక కాదు. ఎవరు ప్రశ్నిస్తారు అనే లెక్కలేని తనంతోనే ఇలా చేస్తున్నారు. గత ప్రభుత్వం మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసిందని చెప్పిన మంత్రి శ్రీధర్‌ బాబు.. అప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోయిందో చెప్పే సాహసం చేయలేదు. ప్రభుత్వం మూసీని శుద్ధి చేస్తామంటే అది మంచి పరిణామమే.. కానీ ఇది కొత్త ప్రాజెక్టు కాదనే విషయం ముందు గుర్తించాలి. కేవలం రూ.16 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచేయడం వెనుక ఏం జరిగిందో కూడా సమాధానం చెప్పాలి. ఎంతసేపు గత ప్రభుత్వానిదే తప్పు అని నిందలు వేయడం కాదు. అధికారంలో ఉన్న వాళ్లు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పాలి. లేకపోతే ప్రజావ్యతిరేకత ఇంకా పెరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదు.

First Published:  1 Oct 2024 7:21 PM IST
Next Story