Telugu Global
Editor's Choice

అన్సారీ ఎపిసోడ్ 'వైఫల్యాల'ను కప్పిపుచ్చగలుగుతుందా ?

అన్సారీ ఎపిసోడ్ వైఫల్యాలను కప్పిపుచ్చగలుగుతుందా ?
X

''కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ల ప్రభావంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు అర్బన్ నక్సలైట్ల ఆలోచనలలాగే ఉన్నాయి. కొంతమంది జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలన్నదే మా ఉద్దేశం. మేము చరిత్రను మార్చడం లేదు. ఒక కుటుంబంతోనే కొంతమంది చరిత్ర పరిమితమైంది'' అని రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను హేళన చేస్తూ ఫిబ్రవరి 8న రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు. ''ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోంది. నక్సలైట్లు దుర్మార్గులు, రాక్షసులు'' అంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చత్తీస్ గఢ్ బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో చెలరేగిపోయారు.

''ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్‌ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్‌ కంట్రోల్‌గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది'' అని కూడా నిందించారు. అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ మద్దతిస్తున్నట్టుగా మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ''మోదీ అసమ్మతిని సహించలేరు.. ఆయన విధానాల్ని ప్రశ్నించినవారిని జాతి వ్యతిరేకులు, అర్బన్‌ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారు'' అని నాలుగేళ్ల కిందటే సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ అన్నారు.

అర్బన్ నక్సలైట్ అనే పేరు 2018 నుంచి తెరపైకి వ‌చ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవారు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నడిపేవారిని అర్బన్ నక్సలైట్లుగా కేంద్రప్రభుత్వం ముద్ర వేస్తోంది. 'భీమా కోరే గావ్' కేసులో పలువురు పౌరహక్కుల సంఘాల కార్య‌క‌ర్త‌లు, రచయితలు, మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు మహారాష్ట్ర జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎల్గార్ పరిషత్ సంస్థ వెనుక నిషిద్ధ మావోయిస్టులు ఉన్నట్టు పుణె పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానమంత్రి మోదీ హత్యకు పథక రచన జరిగిందని ఎన్.ఐ.ఏ.చెబుతోంది. భీమా కోరే గావ్ కేసు తర్వాతే 'అర్బన్ నక్సలైట్లు' అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సమాజంలో వివిధ రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు ఉన్న కొందరు వ్యక్తులు 'అర్బన్ నక్సలైట్లుగా' పనిచేస్తూ భారతదేశ భద్రతకు ముప్పుగా మారారని కేంద్ర హోమ్ శాఖ ఆరోపణలు గుప్పిస్తోంది.

ఒక సందర్భంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ ను కూడా 'అర్బన్ నక్సలైట్'గా చిత్రీకరించడానికి బిజెపి నాయకులు వెనుకాడలేదు. కాగా 2020 లోనూ పార్లమెంటు సమావేశాల్లో 'అర్బన్ నక్సలైట్ల' గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. అయితే 'అర్బన్ నక్సలైట్ల' గురించి సమాచార హక్కు చట్టం కింద 'ఇండియా టుడే' వివరాలు కోరినప్పుడు ''అలాంటి సమాచారమేదీ మా దగ్గర లేదు''అని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖలోని వామపక్ష తీవ్రవాదానికి చెందిన విభాగం స్పష్టం చేసింది. కానీ రాజకీయ ప్రత్యర్థులను, సామాజిక కార్యకర్తలను, హక్కుల కోసం పోరాడేవారిని 'ఉపా' చట్టం కింద అరెస్టు చేయడానికి 'అర్బన్ నక్సలైట్'గా ముద్ర వేయడం సర్వసాధారణమైపోయింది.

ఇప్పుడిక భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వంతు వచ్చింది. ఆయనను కూడా 'అర్బన్ నక్సలైటు'అంటారో దేశ ద్రోహి అంటారో తెలియదు.''ఉప రాష్ట్రపతిగా అన్సారీ ఉన్నప్పుడు ఆయన సాయంతో భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్నినేను తెలుసుకున్నా. మా దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి చేరవేశా. యూపీఏ ప్రభుత్వ కాలంలో అయిదు సార్లు భారత్‌ లో పర్యటించా. దిల్లీకి రమ్మంటూ 2005-2011 మధ్య నన్ను హమీద్ అన్సారీ అయిదుసార్లు ఆహ్వానించారు. భారత్‌కు సంబంధించిన నిఘా, సున్నితమైన సమాచారాన్ని నాతో పంచుకున్నారు''అని పాకిస్తాన్ జర్నలిస్ట్ షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ జర్నలిస్టు, తాను ఐఎస్ఐ ఏజెంటుగా చెప్పుకున్న నుస్రత్ మీర్జా అన్నారు. బెంగళూరు, చెన్నై, చండీగర్, కోల్‌కతా, పట్నా, లఖ్‌నవూ వంటి నగరాలను సందర్శించానని మీర్జా తెలిపారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జాను ఎలా కలుస్తురంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ''నుస్రత్ మీర్జా చెబుతున్నవన్నీ అబద్ధాలు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు'' అని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి వివరణ ఇచ్చారు. ''2010 డిసెంబరు 11న అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిగిన కాన్ఫరెన్స్‌ను నేను ప్రారంభించా. సమావేశంలో పాల్గొనేవాళ్లను ఆర్గనైజర్లు ఆహ్వానిస్తారు. నేను నుస్రత్ మీర్జాను ఎన్నడూ ఆహ్వానించలేదు. ఆయనను ఎన్నడూ కలవలేదు'' అని హమీద్ అన్సారీ చెబుతున్నారు.

కాగా ఇరాన్‌లో తాను భారత రాయబారిగా పని చేసినప్పుడు దేశ భద్రతను తాకట్టు పెట్టానని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టు నుస్రత్ మీర్జా ఢిల్లీలో జన్మించినా దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో ఆయన రిపోర్టింగ్ చేయలేదని కరాచీకి చెందిన సీనియర్ జర్నలిస్టులు ఒక వెబ్ సైట్‌కు చెప్పారు.

''నుస్రత్ మీర్జా నమ్మలేని ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉంటాడు'' అని సాక్షాత్తు నుస్రత్ మీర్జాను ఇంటర్వ్యూ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ కు చెందిన షకీల్ చౌదరి ఒక వార్తా సంస్థకు చెప్పారు. ''ముంబయి దాడులు అమెరికా చేయించినట్టుగా ఒక పత్రికలో నుస్రత్ మీర్జా వ్యాసం రాసిన కారణంగా ఆయనను ఇంటర్వ్యూ చేశా'' అని షకీల్ చెబుతున్నారు.'' నుస్రత్ పాకిస్తాన్‌లో భూకంపం, జపాన్‌లో సునామీకి కూడా అమెరికాయే కారణం''అంటూ అర్ధం లేని రాతలు రాస్తుంటాడని షకీల్ అన్నారు. షకీల్ చెబుతున్న వివరాలను బట్టి నుస్రత్ మీర్జా మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయి.

నాణేనికి ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా పాకిస్థాన్ గూఢచారితో మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ దౌత్యవేత్త హమీద్ అన్సారీకి సంబంధాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్‌ ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీని ఆత్మరక్షణలో పడవేసేందుకు నుస్రత్ మీర్జా అనే పాకిస్థాన్ జర్నలిస్టు 'చెప్పాడ'ని కొన్ని కథనాలను బిజెపి సోషల్ మీడియా వండి వార్చుతోంది.

దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, రూపాయి విలువ భారీగా పతనం కావడం, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ, దేశమంతటా మత విద్వేషాలను రగిలించిన నూపుర్ శర్మ ఉదంతం, గుజరాత్ లో అదానీకి చెందిన ముంద్రా ఓడరేవులో రెండేళ్లలో లక్ష కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల పట్టివేత, పరిశ్రమల మూసివేత,పెరిగిపోతూ ఉన్న నిరుద్యోగం... తదితర అంశాలన్నింటినీ 'కనుమరుగు' చేయడానికి హమీద్ అన్సారీ ఎపిసోడ్ ను బీజేపీ అద్భుతంగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది.

First Published:  16 July 2022 3:17 PM IST
Next Story