అక్కడేమో దోపిడీ.. ఇక్కడైతే అభివృద్ధా!?
మహారాష్ట్రను అదానీకి మోదీషా దోచిపెడుతున్నారన్న రేవంత్.. ఇక్కడేమో రెడ్ కార్పెట్!
''మేమిద్దరం.. మాకిద్దరు అనేది ఇదివరకు నరేంద్రమోదీ, అమిత్ షాల విధానం ఉండే.. ఇప్పుడు అంబానీ ఖతం అయ్యిండు.. అదానీ కోసమే మోదీ, షా ఇద్దరూ కృషి చేస్తున్నరు. ఇప్పుడు ఆ ఒక్కరు, అంటే అదానీ కోసమే మహారాష్ట్రను మోదీషా దోపిడీ చేయాలని చూస్తున్నరు.. ఆయనకు లీగల్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నరు..'' అని తన ప్రియ మిత్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న పూణేలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పూణేలో మీడియా సమావేశం నిర్వహించి మోదీషాలతో పాటు అదానీపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దావోస్ కేంద్రంగా అదానీతో సమావేశమయ్యారు. రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు అదానీ గ్రూప్ తెలంగాణలో పెడుతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి అదానీతో రేవంత్ మైత్రి కొనసాగుతోంది. రేవంత్ మానస పుత్రికగా చెప్పుకునే స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ ఏకంగా రూ. వంద కోట్ల విరాళం ఇచ్చారు. మహారాష్ట్రను దోపిడీ చేసే అదానీ తెలంగాణను మాత్రం ఎలా అభివృద్ధి చేస్తాడనే సామాన్యుల ప్రశ్నలకు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రను అదానీ చెరబట్టిండని.. మోదీషా అండతో దోపిడీ చేయబోతున్నాడని.. ధారావినీ అదానీకి మోదీషా దారాదత్తం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం అదే అదానీకి రెడ్ కార్పెట్ తో వెల్ కమ్ చెప్తున్నాడు. మోదీషాలతో అదానీనే రేవంత్ కు సంధానకర్త అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈడీ రెయిడ్స్ తర్వాత మంత్రి పొంగులేటి వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించకుండా అదానీనే మంత్రాంగం నెరిపాడని కూడా చెప్తున్నారు.
''అదానీ, అంబానీ వంటి కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్టుల నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి.. ఇండియా కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించండి..'' ఈనెల 10న జార్ఖండ్‌లోని రాంఘర్, చిత్తార్పూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ''ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారు.. అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తుంది.. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే జార్ఖండ్ వనరులను రక్షించుకోగలం..'' అని జార్ఖండ్ ప్రజలను హెచ్చరించిన భట్టి విక్రమార్క తాను ఎనర్జీ శాఖ మంత్రిగా ఉండి.. నల్గొండ జిల్లాలో గ్రీన్ ఎనర్జీ (సోలార్ పవర్) ప్లాంట్ తో పాటు రాష్ట్రంలో రెండు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీతులు చెప్పడానికి తప్ప ఆచరణకు ఎంతమాత్రం పనికి రావు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదానీ విషయంలో నిరూపించి చూపించారు. అదానీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారన్న మాట పక్కన పెట్టి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఆయనతోనే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అదానీలాంటి క్యాపిటలిస్టుల సేవలో తరిస్తూ.. పేదల భూములు గుంజుకునేందుకు రాజ్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తూ పైకి మాత్రం తమది ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటున్నారు.
గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణానికి అదానీ లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో అదానీ గ్రూప్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు అమెరికా పేల్చిన బాంబు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది వరకే హిండెన్ బర్గ్ నివేదికతో పార్లమెంట్ సమావేశాలు అట్టుడికి పోయాయి. ఇప్పుడు అమెరికాలో అదానీపై కేసు ఆధారంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు టార్గెట్ చేయబోతున్నాయి. అదానీని అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ పార్టీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అదానీ ఏ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టినా వాటిని నిలుపుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలే కాదు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 9 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అదానీ వ్యవహారంపై రేవంత్ సర్కారును ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ రెడీ అవుతోంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టార్గెట్ చేస్తుంటే తెలంగాణలో అదానీ పెట్టుబడులను రేవంత్ ఎలా సమర్థించుకోగలరు? తమది ప్రజాపాలన అని పూటకు పదిసార్లు చెప్పుకునే సీఎం, డిప్యూటీ సీఎం అదానీ వ్యవహారంలో డిఫెండ్ చేసుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముప్పేట దాడిని తట్టుకోలేక అదానీతో అగ్రిమెంట్లు రద్దు చేసుకుందామా అంటే ఫ్యూచర్ సిటీ, మూసీ పేరుతో తాము తలపెట్టిన రియల్ ఎస్టేట్ దందాకు మొదటికే మోసం వస్తుందనే భయం తెలంగాణ ప్రభుత్వ పెద్దలను వెంటాడుతోంది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గాలేమిటా అనే అన్వేషణలో రేవంత్ టీమ్ పడింది.