అంతన్నాడు.. ఇంతన్నాడు.. నడిమిట్ల వదిలేశాడు!
రెంటికీ చెడ్డ రేవడిలా ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి.. ఉప ఎన్నికలు వస్తే ఎట్లానని హైటెన్షన్
![అంతన్నాడు.. ఇంతన్నాడు.. నడిమిట్ల వదిలేశాడు! అంతన్నాడు.. ఇంతన్నాడు.. నడిమిట్ల వదిలేశాడు!](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402323-brs-mlas-defection-case.webp)
నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రెలైనయట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రస్తుత పరిస్థితి ఇదే. సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకుని పార్టీలోకి వెళ్లారు. త్వరలోనే బీఆర్‌ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమౌతుందని సీఎం సహా ఇతర నేతలు చెప్పిన మాటలు నిజమే అనుకున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రి పదవులు ఖాయమనుకున్నారు. తమపై వేటు పడదని రేవంత్ రెడ్డి అండ చూసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేస్తున్నది. అనర్హత పిటిషన్లపై నిర్ణీత సమయంలోగా తేల్చాలన్న సింగిల్ జడ్జి తీర్పు వాళ్లను షాక్‌కు గురిచేసింది. డివిజన్ బెంచ్ అనర్హత వేటుపై స్పీకర్‌దే అంతిమం అని దానికి గడువు అంటూ ఏమీ లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఆ ఉత్సాహం ఎంతో కాలం నిలువలేదు. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌లపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత నెల 31న దీనిపై విచారిస్తూ అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి? సహేతుక సమయం అంటే మహారాష్ట్రలో వలె పదవీ కాలం ముగిసే వరకా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వారంలో చెప్పాలంటూ స్పీకర్‌కు సూచించింది. దీంతో పది నెలలుగా విపక్షం ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 4వ తేదీ కాంగ్రెస్‌లో చేరిన పది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అదేరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కౌశిక్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని దాంతో పాటే విచారిస్తామని 10వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ తన రిట్ పిటిషన్ లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్‌కుమార్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తేంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆరే కాదు రాజకీయ విశ్లేషకులు అనేకమంది రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందా? అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ముందు నుంచే అలవాటు. కానీ ఎవరినైతే నమ్ముకుని పార్టీ ఫిరాయించారో ఆయనే అది తన సమస్య కాదు అన్నట్టు కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. పీఏసీ ఛైర్మ్‌న్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని ప్లేటు ఫిరాయించారు. కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య వివాదాన్ని విపక్ష పార్టీ గొడవగా మంత్రి శ్రీధర్ బాబు చిత్రీకరించారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన విషయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీఎం కండువా కప్పిన విషయాన్ని కప్పిపుచ్చలేరు.
నిన్న కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఒక విషయాన్ని కరాఖండి చెప్పింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలన్నది మీరు ( స్పీకర్‌ను ఉద్దేశించి) చెప్పకపోతే తామే తేలుస్తామని జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ సందర్భంగా జస్టిస్ గవాయి మాట్లాడుతూ..ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని గత నెల 31న చేసిన సూచనలపై ఏం చేశారని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు. సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇదివరకు చెప్పిందని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయి స్పందిస్తూ ఆ సమయం ఎమ్మెల్యేల కాలపరిమితి ముగిసే సమయం కావొచ్చా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిఘంటువు అర్థం ప్రకారం రీజనబుల్ టైం అంటే ఎంత? 10 నెలల రీజనబుల్ అనిపించలేదా? అని ప్రశ్నించారు. స్పీకర్‌కు ఇతర బాధ్యతలు ఉంటాయని ముకుల్ రోహత్గీ అన్నారు. దీనిపై జస్టిస్ వినోద్ చంద్రన్ స్పందిస్తూ రీజనబుల్ సమయం ఎంతో మీరు (స్పీకర్) చెప్పకపోతే దాన్ని నిర్ణయించడానికి మేమే రీజనబుల్ వ్యక్తులమని ముకుల్ రోహత్గీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటికి ఏదో ఒక నిర్ణయం చెప్పకపోతే సుప్రీంకోర్టు గడువు పెట్టే అవకాశం ఉన్నది.
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌పై చేసిన సెటైర్లపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. ఓటు నోటు కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. అలాంటి అస్థిర నిర్ణయాలు, అర్థం లేని వ్యాఖ్యలు చేసే ఆయనను నమ్ముకుని పార్టీ ఫిరాయించిన వాళ్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్పీకర్‌ను ముందు పెట్టి జాప్యం చేయాలనే ఎత్తుగడలు ఎంతో కాలం నడవవు అని తేలిపోయింది. ఇంకా విషాదమేమంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడటం సంగతి అటుంచితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాళ్లలో ఎంత మందికి టికెట్లు ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నది ఉద్యమకాలం నుంచి చూస్తున్నదే. కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.