Telugu Global
Editor's Choice

అవకాశం ఇచ్చినందుకు ఆగం చేస్తుండు

తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనపై అన్నివర్గాల్లో మొదలైన అసంతృప్తి

అవకాశం ఇచ్చినందుకు ఆగం చేస్తుండు
X

తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇద్దామని పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక్కడి రాష్ట్ర నాయకత్వం కంటే జాతీయ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రజలు ఎక్కువగా విశ్వసించారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రజానీకంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా పార్టీకి నాయకత్వం వహించిన ఆయన చేతిలోనే రాష్ట్రాన్ని పెట్టారు. జడ్పీటీసీగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. పాలన అనుభవం లేదు. ఎన్నికల సమయంలోనే ఆయన వివిధ మీడియాలో మాట్లాడిన మాటలు, ప్రచార మీటింగ్‌లలో ఆయన సొంతపార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాలు అందరి అనుభవంలో ఉన్నవే. ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినప్పుడే చాలామంది బాహాటంగానే వ్యతిరేకించారు. అయితే పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అధిష్ఠానం సూచన మేరకు సర్దుకుపోయారు. కానీ రాష్ట్రంలో హైడ్రా పేరుతో సాగుతున్న రచ్చ ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

తొమ్మిది నెలల కింద ఏ నాయకుడి నాయకత్వంలో రాష్ట్రంలో మార్పు సాధ్యమౌతుందని విశ్వసించారో వాళ్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల వారు అనవసరంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి కోరి కష్టాలు తెచ్చుకున్నామని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ వస్తే ఏం జరుగుతుందో చెప్పిన విషయాలను మననం చేసుకుంటున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లే ఇప్పుడు తప్పు చేశామనే భావనలో ఉన్నారు. తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యతిరేకత రావడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డినే. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కొంత ఆలస్యమైనా అమలు చేసి తీరుతామని భరోసా ఇవ్వగలిగి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అన్నీ ఆరంభశూరత్వాలే. పది నెలల కిందట గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి చేసిన ప్రచారాలే ఇప్పుడు బూమ్‌ రాంగ్‌ అవుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారని రాజకీయ నాయకులు కాదు సగటు ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. నిజం నిలకడగా తెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు లేవని ఆపార్టీ నేతలు కూడా చెప్పడం లేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ చేసినంత మాత్రం లేవని వాళ్లు కుండబద్దలు కొడుతున్నారు. కరెంటు విషయంలో కావొచ్చు, రైతు బంధు విషయంలో కావొచ్చు రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. ఇక నిరుద్యోగులు అయితే తమను నట్టేట ముంచిన ఈ ప్రభుత్వంపై తిరుగుబాటే మొదలుపెట్టారు. ఉద్యోగులు అదే బాటలో ఉన్నారు. దీనికంతటికి కారణం అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ వాటిని అమలు చేయడంలో విఫలమైంది. అలాగే ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రచారాన్ని ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో లేరు.

బాధ్యత మరిచి ప్రతిదానికి గత ప్రభుత్వంపై బట్టకాల్చ మీదేసి చేతులు దులుపుకుంటామంటే ప్రజలు అమాయకులేమీ కాదు. తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన వాళ్లే గత ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రచారం చేసిన గడీల పాలన, సీఎం సెక్రటేరియట్‌కు రారు లాంటివి రాజకీయ విమర్శల కోసం పనికొస్తాయి కానీ వాస్తవాలను బేరీజు వేసుకుంటున్నారు. కొవిడ్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కొంత ఆలస్యమైనా అందాయి. రైతులకు వానకాలం, యాసంగిలో పంట పెట్టుబడి సాయం నిర్ణీత సమయంలోనే వచ్చింది. పింఛన్లు కూడా సకాలంలోనే లబ్ది దారులకు చేరాయి. ఒక్క నిరుద్యోగుల విషయంలో మాత్రం కొంత నష్టం జరిగింది. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఘోరమనే అభిప్రాయం వారిలోనే వ్యక్తమౌతున్నది. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం సహా మంత్రులు పూటక మాట మాట్లాడుతున్నారు. అందుకే 2014 కు ముందు 2024 నాటికి తెలంగాణలో వచ్చిన మార్పులు, పెరిగిన సాగు విస్తీర్ణం, తలసరి ఆదాయం, సాఫ్ట్‌ వేర్‌ రంగంలో అవకాశాలు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పురోగతి, పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా ఉన్న ఫీజులు తగ్గించడానికి బీఆర్‌ఎస్‌ నెలకొల్పిన గురుకులాలు, పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి - షాదీ ముబారక్‌ కింద ఆర్థిక సాయం వంటివి. నథింగ్‌ అన్న నోటి నుంచే సమ్‌థింగ్‌ అనేలా చేశాయి. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పురోగతి పోయి తిరుగమనం దిశగా తెలంగాణ వెళ్తున్నది అన్నది స్పష్టమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కంటే మరింత దిగజారాయి అనే వాదన అన్నివర్గాల ప్రజల్లో వ్యక్తమౌతున్నది. దీనికంతటికీ కారణం కర్త, కర్మ, క్రియ సీఎం రేవంత్‌ రెడ్డినే. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఆయనే బలం. ఇప్పుడు ఆయనే ఆపార్టీకి బలహీనత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట అక్షరాల నిజం.

First Published:  28 Sept 2024 3:14 PM IST
Next Story