Telugu Global
Editor's Choice

గుర్తింపు ఆరాటం

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ హామీలను నమ్మిన ప్రజలే ఇప్పడు ఆయన ప్రభుత్వంపై నిరసన బాట పట్టారు

గుర్తింపు ఆరాటం
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని, తనకు గౌరవం ఇవ్వకున్నా.. ఆ కుర్చీకైనా విలువ ఇవ్వాలన్నారు. విపక్షాలు అదే మొదటి నుంచి అదే చెబుతున్నాయి. మీరు పీసీసీ అధ్యక్షుడు కాదు, ఈ రాష్ట్రానికి సీఎం అని, అలాగే వ్యవహరించాలని కోరుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మీడియా ముందుకు రాగానే పది నెలల కాలంలో కాంగ్రెస్‌ మార్క్‌ పథకం గురించి గాని, వారి పాలనలో తీసుకున్న విధానాల గురించి గాని చెప్పకుండా అన్నిసమస్యలకు బీఆర్‌ఎస్‌, కేసీఆరే కారణమని నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ.. పది నెలల్లోనే ప్రజల్లో ఉన్న పతారా పోగొట్టుకున్నది మీరే కదా! విపక్షాలనే కాదు కోర్టు తీర్పులపై, జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలుచనైంది తమరే కదా. అందుకే పది నెలల కిందట పీసీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన హామీల నమ్మిన జనం ఇప్పుడు మోసపోయామని వాపోతున్నారు. తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జీవో 317 బాధితులు, జీవో 46 బాధితులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ ధర్నా చౌక్‌ లేదా గాంధీ భవన్‌ లేదా, ప్రజాభవన్‌ ముందు నిరసనలు తెలుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతసేపు గుర్తింపు ఆరాటమే తప్పా ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తులేవని, వాళ్లు చేస్తున్న ఆందోళనలపై పట్టింపు లేదని ఆయన వైఖరి చూస్తేనే అర్థమౌతుంది.

మూసీ బాధితులు మాట్లాడితే వారిని కిరాయి మనుషులుగా తన మంత్రుల చేత చిత్రీకరిస్తారు. బాధితుకు భరోసా ఇవ్వడానికి వారి వద్దకు విపక్ష నేతలు వెళ్తే భౌతిక దాడులు చేయిస్తారు. మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అంతకంటే ప్రత్యామ్నాయం ఏమంటుంది? అని ప్రశ్నిస్తారు. అసలు బీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌లే కట్టలేదని విమర్శించిన సీఎం ఇప్పడు నిర్వాసితులకు ఇస్తామంటున్నవి ఎక్కడివో చెబితే బాగుండేది. లేకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ. 1500 కోట్లు ఉన్నాయి. అందులో రూ. 500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు అంటారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించగానే మాట మారుస్తారు. విపక్ష నేతలకే పీఏసీ ఛైర్మన్‌ ఇచ్చామన్న సీఎం దానికైనా కట్టుబడి ఉండకుండా.. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్‌లో మనోళ్లే వెళ్లి బీఆర్‌ఎస్‌ వాళ్లను చింతపండు చేశారు అంటారు. అలాగే అంతకుముందు ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విపక్ష నేతల కాన్వాయ్‌పై దాడులను ప్రోత్సహిస్తారు. లేకపోతే విపక్షాల పని ఏమిటి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు చెబితే పరిష్కరిస్తాం అంటారు. అలాగే బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నదని అందులోంచి రూ. 1000 కోట్లు వరద బాధితులకు ఇవ్వాలంటాడు. ఇవన్నీ రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగానో.. ఆ పార్టీ కార్యకర్తగానో అనలేదు. సీఎం అయ్యాకే ఇలా నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ.. తనను గౌరవించాలంటారు.

ముఖ్యమంత్రికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు (నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేయకున్నా) అందించడానికి సమయం ఉంటుంది. కానీ మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారు ఏం కోరుతున్నారో అడగరు. కొత్త రేషన్‌ కార్డుల కోసం, ఆరు గ్యారెంటీల పథకాలు పొందడానికి ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో తెలియదు. ప్రజాభవన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏమైందో తెలియదు. కొత్తగా గాంధీ భవన్‌లో మరో వేదిక తెరిచారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వాళ్లంతా నిత్యం గాంధీభవన్‌ ముందు రోడ్డుపై బైఠాయిస్తున్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడటానికి పది నెలలుగా చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజలకు అర్థమైంది. అందుకే ప్రజాపాలన పేరుతో మీరు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించడం లేదు. మీకు గుర్తింపు ఆరాటమే తప్పా.. ప్రజా సమస్యలు పట్టవని పదినెలల మీ పాలనను చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం కార్యాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చివరగా.. పాలకుల పనితీరే గుర్తింపు తెచ్చిపెడుతుంది. ప్రజాదరణ దానితోనే వస్తుందన్నది గ్రహించాలి. అంతేగాని తమది ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్నంత మాత్రానా ప్రయోజనం ఉండదన్నది మీ ప్రభుత్వంపై వివిధ సమస్యలపై తిరుగుబాటు చేస్తున్నప్రజల నిరసనలే అందుకు నిదర్శనం.

First Published:  4 Oct 2024 10:39 AM IST
Next Story