Telugu Global
Editor's Choice

హర్యానాలో ఓటమి కాంగ్రెస్‌ స్వయంకృతం

ఖట్టర్‌ పాలనపై ప్రజాగ్రహాన్ని గుర్తించిన బీజేపీ సక్సెస్.. సొంతపార్టీలోనే నెలకొన్న కలహాలతో కాంగ్రెస్‌ ఓటమి

హర్యానాలో ఓటమి కాంగ్రెస్‌ స్వయంకృతం
X

కాంగ్రెస్‌ పార్టీ బీజేపీలో నేరుగా తలపడే చోట ఆపార్టీని ఎదుర్కోలేకపోతున్నది. గుజరాత్‌ మొదలు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలో ఆ పార్టీ గెలువడానికి అనేక కారణాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్‌ పార్టీకి గెలుపునకు దోహదపడ్డాయి. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయపార్టీల సహకారం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని నేరుగా ఎదుర్కోలేదని ఆయా పార్టీలే కాకుండా రాజకీయ విశ్లేషకుల వాదన. తాజాగా హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఆపార్టీ ఓడిపోవడం ఆ వాదనకు బలం చేకూరుస్తున్నది.

హర్యానాలో జాట్‌-దళిత్‌ ఓటు బ్యాంకుకు తోడు రైతుల ధర్నాలు, అగ్నివీర్‌, రెజర్ల ఆందోళన వంటివి తమను గట్టెక్కిస్తాయని భావించింది. పోనీ దళిత ఓటర్లలో మెజారిటీ వర్గం తమవైపు మళ్లాలంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి వెన్నెముఖగా ఉన్న కుమారి సెల్జా విషయంలోనూ ఆపార్టీ అధిష్ఠానం సరిగ్గా వ్యవహరించలేదు. దీంతో కాంగ్రెస్‌ వ్యూహం బెడిసి కొట్టింది. హర్యానా కాంగ్రెస్‌లో ఉన్న కలహాలను కాషాయ పార్టీ నేతలు ప్రస్తావించారు. సెల్జాను తమపార్టీలోకి ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం మొత్తం భూపేందర్‌ హుడాకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. టికెట్ల కేటాయింపులోనూ 70 సీట్లను ఆయన సూచించిన వారికే ఇచ్చింది. పార్టీలో దళిత నేత అసంతృప్తిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని టికెట్లు కేటాయింపు సమయంలో వ్యహరించిన తీరే దానికి అద్దం పట్టింది. ఫలితాల అనంతరం కొన్నిచోట్ల మెజారిటీలు అత్యల్పంగా ఉండటంతో రెండు పార్టీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉన్నది. దీంతో ఈ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలు ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు చేశారు. కానీ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి దీనికి కారణమని గ్రహించలేదు.

అలాగే హర్యానాలో బీజేపీ 39.89 శాతం ఓట్లతో 48 సీట్లు గెలువగా.. 37 సీట్ల వద్దే ఆగిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి 39.05 శాతం. అంటే రెండుపార్టీల మధ్య 0.89 శాతమే. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్‌ ఇక్కడ ఖాతా తెరవకపోయినా ఆపార్టీ 1.79 శాతం ఓట్లు సంపాదించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు సానుభూతికి తోడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు ఢిల్లీ కేంద్రంగా చేసిన ఉద్యమానికి ఆప్‌ ప్రభుత్వం అందిస్తున్న సహకారమే అని బీజేపీ అప్పట్లో విమర్శించింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీని కలుపులేకపోయినా.. కనీసం సర్దుబాటు కూడా చేసుకోలేకపోయింది. అలాగే హర్యానాలో ఈజీగా గెలుస్తామని రాహుల్‌గాంధీ అనుకున్నారు. ఈ గెలుపు ద్వారా తాను దేశ్‌ కీ నేత అవుతానని భావించారు. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచాలు, కాంగ్రెస్‌ నేతల అతి విశ్వాసం ఆ పార్టీ కొంప ముంచాయని ఎగ్జాక్ట్‌ ఫలితాలు తేల్చాయి.

కానీ తొమ్మిదిన్నరేళ్ల మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాలనపై ప్రజలు గుర్రుగా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం గ్రహించింది. అందుకే కేంద్రమంత్రిగా ఉన్న నాయబ్‌సింగ్‌ సైనీని సీఎం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు 200 రోజుల ముందు ముఖ్యమంత్రిని మార్చిన కషాయ పార్టీ మ్యాజిక్‌ చేసింది. బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామని ఏమీ అనుకోలేదు. కానీ ఓబీసీ నేత అయినా నాయబ్‌సింగ్‌ సైనీని ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లింది. ప్రధాని గత ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించినా ఈసారి మాత్రం నాలుగు ర్యాలీలకే పరిమితమయ్యారు. కానీ ఆపార్టీ చేసిన పని ఏమిటి అంటే సీఎం మార్పు తర్వాత సైనీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో అప్పటివరకు ఖట్టర్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహాన్ని చాలావరకు తగ్గించగలిగారు. వీటన్నింటికంటే ముఖ్యంగా వ్యతిరేక ఫలితాలు వచ్చినా బాధ్యత స్వీకరించడానికి సిద్ధమని నాయబ్‌సింగ్‌ ప్రకటించారు. గెలిస్తే ఘనత పార్టీది. ఓడితే తనది బాధ్యత అని చెప్పారు.

హర్యానాలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ విశ్లేషణ చేసుకోవాలి. ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా అరుదు అని అసోంలో పవర్‌లోకి వచ్చి 13 ఏండ్లు అయ్యింది. కొన్నిరాష్ట్రాల్లో 60 ఏళ్ల నుంచి అధికారంలోకి లేదు. ఒక్కసారి ఆపార్టీని ఓడిస్తే మళ్లీ అధికారంలోకి రానివ్వరు.. నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేడానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు విమర్శించవచ్చు. ప్రధానే కాదు ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ వైఖరిపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. హర్యానా ఫలితాల తర్వాత టీఎంసీ నేత సాకేత్‌ గోఖలే చేసిన వ్యాఖ్యలు కొంత సహేతుకంగానే ఉన్నాయి. కాంగ్రెస్‌ గెలుస్తుందని భావిస్తే ఏ పార్టీని చేర్చుకోదు. కానీ ఆ పార్టీ పరిస్థితి బాగాలేకపోతే మాత్రం ప్రాంతీయపార్టీ పార్టీలు సహకరించాలి. అహంకారం, ప్రాంతీయపార్టీలను చిన్నచూపు చూడటమే ఈ విపత్తుకు మూలం అన్నారు. ఇలాంటి తీరే ఎన్నికల్లో ఓటమికి దారితీస్తుందన్నారు .కాబట్టి కాంగ్రెస్‌ తన వ్యూహాల గురించి పునరాలోచించుకోవాలి. అంతేగాని ఎన్నికల ఫలితాలపై ఈసీ, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం వంటివి ఆ పార్టీని బలోపేతం చేయవు. ఈ కారణాలతో ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాలేవని గుర్తించుకోవాలి.

First Published:  9 Oct 2024 9:00 AM GMT
Next Story