Telugu Global
Editor's Choice

కాంగ్రెస్‌ కొలువుల కథ

నియామకాలపై ప్రభుత్వ ప్రకటనలు.. నిరుద్యోగులు, విపక్షాలు చెప్తున్న నిజాలు

కాంగ్రెస్‌ కొలువుల కథ
X

అధికారం కోసం గత ప్రభుత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయాలి. అసత్యాలు వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయాలి. తద్వారా ఓట్లు, సీట్లు సంపాదించాలి. ఇదీ కాంగ్రెస్‌, ఆ పార్టీ పెట్టుకున్న ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు చేసిన విష ప్రచారం. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వంపై, వారి విధానాలను వ్యతిరేకించిన వారు ఆశించారు. కానీ పది నెలల కాలంలోనే అప్పుడెప్పుడో అమెరికాలో ప్రజలు మా చేత మోసపోవాలని కోరుకుంటున్నారని, రోగి ఏది కోరుకుంటే డాక్టర్‌ అదే ఇవ్వాలి అని రేవంత్‌ డైలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా మారింది. అందుకే అసత్యాల పునాదులు, గత ప్రభుత్వంపై నిందల, ప్రశ్నించిన వారిపై బూతులతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నది. ప్రజలు ఏమైనా అనుకోని కానీ మనం మాత్రం లైన్‌ తప్పకూడదు అన్నట్టు అబద్ధాలనే ప్రభుత్వం ప్రచారంలో పెట్టింది.

రెండు రోజుల కిందట రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై సీఎంవోల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించింది. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికి ఇది ముందుపెట్టింది. రాష్ట్రంలో ఏం జరగనట్టు అంతా సవ్యంగా ఉన్నట్టు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేలా ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని ముందుకు తెచ్చింది. అందులో వాస్తవాలు ఏమిటి అన్నది విశ్లేషణ చేయాల్సిన అక్కర లేదు. మొన్నటిదాకా గత ప్రభుత్వాన్ని నియామకాలపై నిందించిన వాళ్లే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన కొలువులు, విడుదల చేసిన నోటిఫికేషన్లపై నోటికి అంకెలతో సహా చెప్తున్నారు.

డీఎస్సీ, గురుకుల నియామకాల గురించి

'గత ప్రభుత్వం పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలను అందించనున్నట్లు సీఎం వెల్లడించారని' అందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒకేసారి డీఎస్సీ వేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకుంటున్న 11,062 పోస్టుల్లో గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 లకు పైగా పోస్టులతో వేసిన నోటిఫికేషన్‌ రద్దు చేసే మరికొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ విషయం దాస్తే దాగుతుందా? లేదా నిరుద్యోగులకు ఏవీ గుర్తుండవు అని రేవంత్‌ సర్కార్‌ అనుకుంటున్నదా? అలాగే వీటితో పాటు గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి వివిధ దశల్లో వేలాది పోస్టులను భర్తీ చేసింది వాస్తవం. 2014 -2023 డిసెంబర్‌ 9 కి ముందు వరకు గురుకులాలలో నియమితులైన వారంతా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇక ఈ సర్కార్‌ మరో డబ్బా ఏమిటి అంటే 'రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 8,304 మందికి నియామక పత్రాలను అందించింది' అంటున్నారు. ఈ నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు? అన్నది కూడా చెప్తే నిరుద్యోగులు సంతోషిస్తారు. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ అని దగా చేశారని మొన్నటి వరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది అందరూ చూశారు. ఈ ప్రభుత్వానికి నియామకాలపై నిజాయితీ లేదని దానితోనే వాళ్లకు అర్థమైంది.

కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన నోటిఫికేషన్లు

'గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3967 పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నిషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషం అన్నది' సంతోషం. మీరు నిరుద్యోగులకు ఇచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలలో ఇవి పూర్తయితే ఇంకా ఎన్ని మిగులుతాయి? అన్నది చూడాలి.

టీజీపీఎస్సీ భర్తీ చేయనున్న పోస్టులు

'టీజీపీఎస్సీ ద్వారా 26 వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా దాదాపు 17341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొందరికీ నియామక పత్రాలు అందించింది. ఇటీవలే ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. 8180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సంక్షేమ శాఖలలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి. గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయితే.. నెల రోజుల్లో జులై 7న ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షెడ్యూలు ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించనున్నది'

వీటిలో గ్రూప్‌-1లో 60 పోస్టులు మనహా మిగిలినవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కదా! వీటిలో చాలావరకు పరీక్షలు నిర్వహించి, కొన్నింటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసి, కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో పాటు ఎన్నికల కోడ్‌ వంటివి కూడా నియామక పత్రాలు అందించడానికి కారణం. ప్రభుత్వాలు మారినా నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పనే. అంతమాత్రానా వాటన్నింటికీ తామే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు, ఇవన్నీ నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీలో భాగమని మీరు ప్రచారం చేసుకుంటే చేసేది ఏమీ లేదు. కానీ నియామకాలపై గత ప్రభుత్వం భర్తీ చేసినవి ఎన్ని? ఈ ప్రభుత్వం విడుదల చేసినవి ఎన్ని? అన్నది రికార్డులు స్పష్టంగానే ఉన్నది.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు

'పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వరంలో 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించ లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించింది. ' ఈ నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. పరీక్షలతో పాటు ఫిజికల్‌ టెస్టులు పూర్తి చేసింది గత ప్రభుత్వమే. జీవో 46 అంశంపై కోర్టు కేసుల వల్ల ఈ నియామకం ఆలస్యమైంది. అలాగే కొన్ని నోటిఫికేషన్లపై కేసులు వేసింది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలే అన్నది బహిరంగ రహస్యమే. ఆ జీవో 46 బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నిలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు నట్టేట ముంచారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లను అడిగితే ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది ఎవరు? ఆ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుందో ఖుల్లం ఖుల్లా చెప్తారు.ఇక చివరగా...' మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 డిసెంబర్లో నిర్వహించిన 7094 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు కూడా అప్పుడు పెండింగ్ లో పడ్డాయి. ఫలితాలను విడుదల చేసిన కొత్త ప్రభుత్వం వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది.' ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది గత ప్రభుత్వమే. మరి ఇందులో ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటో చెప్పాలి.

రెండు లక్షల ఉద్యోగాలు ఉత్త ముచ్చటే

ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కొలువుల ముచ్చట చూస్తే అందులో కాంగ్రెస్‌ ఇచ్చిన నోటిఫికేషన్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాగే వాళ్లు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ వాలిడిటీ కూడా మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా ఖాళీలను భర్తీ చేస్తామన్న భరోసా కూడా ఇవ్వలేకపోతున్నది. ఇటీవల సీఎం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగ సమస్య పోదు అన్నారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే కొన్నింటికి మంగళం పాడింది. వాటిలో నియామకాల అంశం కూడా త్వరలో చేరనున్నది. కాబట్టి నిరుద్యోగులూ బీ అలర్ట్‌.

First Published:  2 Oct 2024 5:51 AM GMT
Next Story