Telugu Global
Editor's Choice

కాంగ్రెస్‌ బీసీ సీఎం.. పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యల వెనుక?

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మార్పు తర్వాత మారుతున్న నేతల స్వరం

కాంగ్రెస్‌ బీసీ సీఎం.. పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యల వెనుక?
X

బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం అవుతారు. అది కాంగ్రెస్‌ పార్టీలోనే అవుతారు. వచ్చే ఎన్నికలన్నీ బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ ఐదేళ్లు రేవంత్‌ రెడ్డే సీఎంగా కొనసాగుతారు. రానున్న రోజుల్లో మాత్రం బీసీలకే ఈ అవకాశం ఉంటుంది.- గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు

ఆ మధ్య పదేళ్లు నేనే సీఎం అని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే మాటను ఆయన పదే పదే ఉటంకించారు. గతంలో ఒకే పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని 1994-2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీల గురించి 2014-2023 వరకు బీఆర్‌ఎస్‌ పాలనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే మాకు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని, కాబట్టి వచ్చే ఐదేళ్లూ సీఎం సీటు నాదేనని స్పష్టంగానే చెప్పారు. కానీ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో జరిగిన పరిణామాలతో సీఎం స్వరం మారింది. మంత్రులు, అధికారులు తనకు సహకరించడం లేదని, కొంతమంది మంత్రులు తన సీటుపై కన్నేశారని వార్తలు వచ్చాయి. సీఎం పోస్టుపై పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వేశారు. కానీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలువడం, సీఎం సీటు బీసీలు రాహుల్‌ గాంధీ ఇస్తారని మహేశ్‌కుమార్‌ చెప్పినట్లు జరిగే అవకాశాలు 10 శాతం కూడా లేవు.

కొన్నిరోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల్లో సడలుతున్న నమ్మకం వంటివి బేరీజు వేసుకుని ఏదో జరుగుతున్నదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌ బీసీలదే సీఎం సీటు అని వ్యాఖ్యానించడం కొంత ఆలోచనలో పడేసింది. ఎందుకంటే రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్‌ మున్షీ తప్పించి రాహుల్ గాంధీ విధేయురాలైన మీనాక్షి నటరాజన్ నియమించారు. అది కూడా సీఎం రేవంత్‌ రెడ్డి టూర్ కు పయనమైన తర్వాత జరిగిన పరిణామం ఇది. మీనాక్షి నియామకం తర్వాతే రాష్ట్ర వ్యవహారాలన్నీ పార్టీ హైకమాండ్‌ తమ చేతుల్లోకి తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీలకు రాహుల్‌ రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించారని పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగానే భావించాలి.

First Published:  17 Feb 2025 4:40 PM IST
Next Story