Telugu Global
Editor's Choice

ప్రజాగళమా? మోడీ భజనా?

చంద్రబాబు ప్రసంగం సైతం మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంతోనే సాగింది. ప్రసంగించినంతసేపు మోడీ నామజపం చేశారు చంద్రబాబు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు.

ప్రజాగళమా? మోడీ భజనా?
X

చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట జరిగిన సభ, ఎన్డీఏ సభలా కాకుండా బిజెపి సభలా, మోడీ భజన సభలా జరిగిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ పోటీ పడి నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరం. అంతకుముందు మాట్లాడిన బిజెపి నాయకులు కూడా మోడీని అంతగా పొగడలేదు. మొదట మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌ ప్రసంగమంతా మోడీ భజనతోనే సరిపోయింది. జగన్‌ పాలన పోవాలని ఒక మాట అన్నారేగానీ తమ కూటమికి ఎందుకు ఓటు వేయాలో స్పష్టంగా చెప్పలేకపోయారు.

తరువాత మాట్లాడిన చంద్రబాబు ప్రసంగం సైతం మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంతోనే సాగింది. ప్రసంగించినంతసేపు మోడీ నామజపం చేశారు చంద్రబాబు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు. డిజిటల్‌ ఇండియా మొదలయిన మోడీ పథకాల గురించి మాట్లాడారు. పనిలోపనిగా డీమానిటైజేషన్‌ వల్ల ఆర్థికవ్యవస్థ చక్కబడిందన్నారు. గతంలో ఇదే చంద్రబాబు డీమానిటైజేషన్‌ వల్ల పేదలు కష్టాల పాలయ్యారని విమర్శించారు. ఇపుడు అదే నోటితో మోడీని కీర్తించడం వైచిత్రి. ఉపన్యాసంలో అధిక సమయం మోడీ పేరును పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం వినేవాళ్ళకు, అక్కడ హాజరయిన జనాలకు సైతం విసుగొచ్చేలా సాగింది బాబు ప్రసంగం.

పవన్‌కు పెద్దగా రాజకీయ అనుభవం లేదు, అవగాహన లేమి, అనుభవ లేమితో మోడీని పొగడటమే పనిగా పెట్టుకోడంలో ఆశ్చర్యం లేదు. కానీ, నాలుగు దశాబ్దాలపైబడిన రాజకీయ అనుభవం గల చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా ఒక సాధారణ నాయకునిలా మోడీపై పొగడ్తల వర్షం కురిపించడం ఎబ్బెట్టుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి అధినేతగా కాకుండా బిజెపి నాయకునిలా బాబు ప్రసంగం సాగడం రాజకీయ దివాళుకోరుతనాన్ని సూచిస్తున్నది.

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉండాలంటూ ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు బాబు. కానీ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది విస్పష్టంగా చెప్పలేకపోయారని పరిశీలకులు అంటున్నారు. జెండాలు వేరయినా తమ ఎజెండా ఒకటేనని బాబు అన్నారే గానీ, నిజంగా తమ ఎజెండా ఏమిటో చెప్పలేని బలహీనత చంద్రబాబు ప్రసంగంలో కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం బిజెపి ఎన్నికల ప్రచారంగా సాగింద‌న‌డంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తన తొలి ఎన్నికల సభగా చిలకలూరిపేట సభని మోడీ అభివర్ణించారు. బిజెపి 400 సీట్లను గెలుచుకుంటుందని, కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉండాలని, అందుకోసమే తమకు ఓటు వేయాలని ప్రధాని చెప్పారు. కనుక మొత్తంగా చిలకలూరిపేట సభ ఎన్డీఏ కూటమి సభలా కాకుండా బిజెపి ఎన్నికల ప్రచార సభలా జరిగిందని జనాలు అనుకోవ‌డంలో వింత ఏముంది! ఇది ప్రజల గళం కాదు మోడీ గళం, బిజెపి గళం వినిపించడానికి బాబు, పవన్‌లు ఏర్పాటు చేసిన సభలా వుందన్నదే పరిశీలకుల మాట.

First Published:  18 March 2024 2:55 PM IST
Next Story