Telugu Global
Editor's Choice

చంద్రబాబు చెప్పుకుంటున్న స్వీయ చరిత్ర

జగన్‌ చెప్పిన మూడు రాజధానుల అంశాన్నే మరో విధంగా చెబుతన్న ఏపీ సీఎం

చంద్రబాబు చెప్పుకుంటున్న స్వీయ చరిత్ర
X

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా సొంత డబ్బా ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు. అందుకే చరిత్ర తిరగరాస్తామని ఆయన బావమరిది హీరో బాలకృష్ణ సినిమాల్లో చెప్పే డైలాగుల వలె ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతుంటారు. ముందుచూపుతో నాడే సైబరాబాద్‌లో ఎనిమిది లైన్ల రోడ్డు వేశామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతి చోటా ఉంటారని అన్నారు. అయితే హైదరాబాద్‌ నగర అభివృద్ధి గురించి చంద్రబాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ప్రపంచానికి తెలుసు. కానీ తాను సీఎం అయ్యాకే హైదరాబాద్‌ను ప్రపంచం పటంలో పెట్టాను అన్నట్టు చెప్పుకుంటారు. నారా వారు ఐదేళ్లుగా రాజధాని పేరుతో రాజకీయం చేయడం మినహా నిర్మాణం మాత్రం పూర్తి చేయలేకపోయారు. అనుభవజ్ఞుడని రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు ఆయనకు అధికారం అప్పగిస్తే చంద్రబాబు రాజధాని పేరుతో చేసింది అందరికీ తెలిసిందే. ఏపీ రాజధాని స్థలం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ రిపోర్టు రాకముందే, ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోకముందే చంద్రబాబు అమరావతే ఏపీ రాజధాని అని అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. దీనికి ప్రధాని సహా అందరూ హాజరయ్యారు. కానీ తన పదవీ కాలంలో శాశ్వత సెక్రటేరియట్‌ కూడా చంద్రబాబు పూర్తిచేయలేకపోయారు.

ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, అభివృద్ధి అనేది ఒకేచోట ఉంటే మళ్లీ విభజన వాదాలు ముందుకు వస్తాయని (ఏపీ, తెలంగాణ విభజన సమయంలో రాయలసీమ నేతలు తాము తెలంగాణతోనే ఉంటామన్నారు) విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మాటలే నాడు వైఎస్‌ జగన్‌ చెప్పారు. కాకపోతే మూడు చంద్రబాబు వలె మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనకుండా మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఏదో ఉప ద్రవం ముంచుకొస్తున్నది అన్నట్టు ప్రచారం చేశారు. ఇదే అంశంపై గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ అక్కడి సాధారణ ప్రజలు తమకు సొంత రాజధాని ఉండాలనే ఆశలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. కానీ ఇప్పుడు జగన్‌ చెప్పిన ముచ్చటే చంద్రబాబు చెబుతున్నారు. విశాఖ ఆర్థిక రాజధాని చేస్తామన్నారు. రాయలసీమ ప్రజల కోరిక మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలంగా 1953 అక్టోబర్‌ 1న ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని. ఇది చరిత్ర. కానీ చంద్రబాబు తన సొంత ప్రచారం కోసం చరిత్ర మార్చి చెబుతుంటారు.

ఐదేళ్లు పాలనా కాలంలో ఏపీ ప్రజల కల సాకారం కాలేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. కేంద్రం కూడా ఏపీ రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించింది. గతంలో వలె మోడీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నీళ్లు, మట్టి కాకుండా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నది. విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ఇరవై ఏళ్ల కిందట సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పదేళ్ల హయాంలో, విభజన అనంతరం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందింది. ఇంకా గతంలోనే ఉండకుండా వర్తమానంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఈసారి అయినా నిలబెట్టుకోవాలి.

First Published:  19 Oct 2024 1:44 PM IST
Next Story