Telugu Global
Editor's Choice

అసలే చంద్రబాబు.. ఆ పైన తెలంగాణ!!

చంద్రబాబును 'అవుట్ సైడర్'గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.

Chandrababu Naidu
X

''నంగనాచి కబుర్లు చెప్పే చంద్రబాబూ.. మాతో కెలుక్కున్నావు జాగ్రత్త.. తెలంగాణ దెబ్బ తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పోయి పడినవ్‌. మా బతుకు మేం బతుకుతున్నం, మా ఎవుసం మేం చేసుకుంటున్నాం. ఇక్కడకు వచ్చి అనవసరంగా దుకాణం పెడదామనుకుంటున్నావు. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో తెలుసుకో'' అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 2018 ఎన్నికల్లో తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ''చంద్రబాబు 15 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే డిండికి నీళ్లు రానివ్వడు, ఎడమ కాలువను ఎండబెడతాడు. చంద్రబాబు నయవంచకుడు, ద్రోహి, నమ్మదగిన వ్యక్తి కాదు. బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు'' అని కూడా కేసీఆర్ అప్పట్లో చెలరేగిపోయారు. ఈ మాటలు ఓటర్లను ఎంత సూటిగా తాకాయో చూశాం.

''ఇద్దరం కలిసి ఉండాలని కోరుకోవడం నేను చేసిన తప్పా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం నా తప్పా? హామీలు అమలు చేయాలని కోరడం తప్పా? పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీనవర్గాలకు వెన్నంటి ఉండి తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పా? తెలంగాణలో టీడీపీ ఉండటానికి కేసీఆర్‌ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు?'' అని చంద్రబాబు నాయుడు గడచిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలతో కూడిన కూటమి పక్షాన ప్రచారంలో భాగంగా కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

''తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా. నేను వేసిన అభివృద్ధి పునాదులు తెలంగాణలో కొనసాగుతున్నాయి. ఏపీలో విధ్వంసం సాగుతోంది. గాడి తప్పిన ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి పథంలో పెట్టే బాధ్యత నాదే అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండాల్సిన అవసరం ఉంది''అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మంలో అన్న మాటలపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ రావాలి, టీడీపీ కావాలి అని కోరుకునేవారెవరూ కాగడాపెట్టి వెతికినా కానరావడం లేదు.

చంద్రబాబును 'అవుట్ సైడర్'గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు. ఉన్నదల్లా కొన్ని చోట్ల కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు వీరాభిమానులు మాత్రమే..!

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు అభిప్రాయం ఏమిటో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీలో విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగాలు ఎందుకు చావు దెబ్బ తిన్నాయో తెలంగాణ ఓటర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. 2015లో ఓటుకు నోటు కేసుకు ఎవరు దర్శకత్వం వహించారో, ఆ కేసు వెలుగు చూశాక విజయవాడకు హుటాహుటీన ఎందుకు రవాణా అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రధాని మోడీతో స్నేహం ఎందుకు చేశారో, తెగదెంపులు ఎందుకు చేసుకున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

''నేను వేసిన పునాదుల మూలంగానే ఇవాళ తెలంగాణ అన్ని పెద్ద రాష్ట్రాల్లో కల్లా అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేస్తున్న రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ ఇందుకు విరుద్ధంగా పాతాళానికి పడిపోయింది'' అన్నది చంద్రబాబు మాట. ఏపీలో 2014 నుంచి 2019 లో ఆయన హయాంలో ఆర్థిక పరిస్థితి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. తెలంగాణలో తలసరి ఆదాయం పెరగడానికి కేసీఆర్ కారణమని ప్రపంచానికి తెలుసు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి చంద్రబాబు ఎప్పుడు పునాదులు వేశారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు సమాధానాలు చెప్పవలసి ఉన్నది.''ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉంది''అనడం చంద్రబాబు అమాయకత్వాన్ని బయటపెట్టింది. తెలంగాణ సాధించిన టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పని పరిస్థితిలో ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణల్లో ఓటు అడిగే హక్కు లేదా? తెలంగాణ అవతరణకు అడ్డంకులు కల్పించేందుకు చివరిదాకా కుట్రలు, కుతంత్రాలు చేసిన చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు ఉంటుందా? ఉంటే తెలంగాణ ఏర్పాటులో ఆయన వాటా ఏమిటి..?

''ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణా గడ్డపై తెలుగుదేశం పార్టీకి గత వైభవం రావడం ఖాయమ''ని కొద్దీ రోజుల కిందట టీ-టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ ప్రమాణస్వీకారోత్సవం వేళ చంద్రబాబు చెప్పిన మాట. అసలు టీడీపీకి పూర్వ వైభవం అంటే ఏమిటి? బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిష్టులు, బహుజన సమాజ్ పార్టీ, షర్మిల పార్టీ, మజ్లీస్.. ఇలా కనీసం అర డజన్‌కు పైగా పార్టీలు హోరాహోరీగా తలపడుతుండగా, బలగాలను మోహరిస్తుండగా తెలంగాణలో 'డైనోసర్' గా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ ఎట్లా బతికి బట్టకడుతుంది..? ఆ పార్టీకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చే సామాజిక వర్గాలు, మద్దతిచ్చే వ్యక్తులు, శక్తులు ఎవరు..?

'తెలుగువారి ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం' అని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఆ పార్టీని నిర్మించిన ఎన్ఠీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమన్న అపవాదును జీవితాంతం మోస్తున్న బాబు నోట ఈ మాటలు రుచించడం లేదు. 'తెలుగు జాతి గుండెచప్పుడు అన్న ఎన్టీఆర్‌ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ పుట్టింది' అంటున్నారు. 'ఆ గుండె చప్పుడు'ఆగిపోవడానికి కారకులు ఎవరు..? సరే, అదంతా చరిత్ర. ఇంతకూ 'చంద్రబాబు టీడీపీ నకిలీది'అని తెలంగాణ మంత్రి, పూర్వాశ్రమంలో చంద్రబాబు పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చిపారేశారు. ఇప్పుడు టీడీపీ హక్కుదారు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా ఆయన అన్నారు.

'టీడీపీ నుంచి వెళ్లినవారంతా వెనక్కి రావాల'ని చంద్రబాబు ఘర్ వాపసీ నినాదం ఇచ్చారు. ఈ నినాదం వర్కవుట్ కాదు. చెల్లని టీడీపీలోకి వెళ్లి చెజేతులా తమ రాజకీయ భవిష్యత్ ను దెబ్బ తీసుకోవాలని ఎవరనుకుంటారు..?

టీడీపీలోకి కేసీఆర్ వెళ్ళాలా..? ఎర్రబెల్లి వెళ్ళాలా..? తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళాలా..?ఇంకా ఎవరెవరు వెళ్ళాలి..? ఏమిటీ వింత కోరిక!!

First Published:  23 Dec 2022 8:01 PM IST
Next Story