ఇంత చేసినా ఇంకా జగన్‌పై ఏడుపేనా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో అప్పులను పెంచారు, పేదరికాన్నీ పెంచారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను గాడిలో పెట్టి రాష్ట్రం ముందడుగు వేయడానికి అనేక చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పులు 169 శాతం పెరిగితే, జగన్ వాటిని 58 శాతానికి తగ్గించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంక, వెనిజులా చేస్తున్నారని మొత్తుకునే టీడీపీ అనుకూల మేధావి వర్గానికి, ఎల్లో మీడియాకు ఇది ఒక చెంపపెట్టు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావించకుండా జగన్ ప్రభుత్వంలోని అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ చంద్రబాబు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. వాటిని అమలు చేస్తే రాష్ట్రం ఏమవుతుందనే విషయం గురించి ఆ వర్గాలు మాట్లాడడం లేదు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే మొత్తం రూ.4.49 లక్షల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలిగింది. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో రాష్ట్రంలో పేదరికం క్రమేణా తగ్గుతోంది. రాష్ట్రంలో పేదరికం 2015-16 నాటికి 11.77 శాతం ఉండగా 2022-23 నాటికి 4.19 శాతానికి తగ్గింది.
కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించింది. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపింది. సంగం, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు టన్నెల్, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, కుప్పం బ్రాంచ్ కెనాల్ లను పూర్తి చేసి జగన్ జాతికి అంకితం చేశారు.
పారదర్శకమైన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ యేటా అగ్రస్థానంలో నిలుస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాలుగు ఓడరేవులు, పది షిప్పింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండస్ట్రియల్ నోడ్స్ తో పారిశ్రామిక ప్రగతిని జగన్ పరుగులెత్తిస్తున్నారు.
పారిశ్రామికాభివృద్ధి రేటులో దేశంలో రాష్ట్రం 2018-19 నాటికి 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా 2021-22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకింది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని జగన్ ముందుకు నడిపించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి తలసరి ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రంలో 2018-19లో తలసరి ఆదాయం రూ.1,54,031 ఉంటే 2022-23 నాటికి రూ.2,19,518కి చేరుకుంది.