కేంద్రం నిధులిస్తామన్నా రాష్ట్ర వాటా విడుదల చేయట్లే!
రూ.665 కోట్లు వినియోగించుకోలేని దుస్థితిలో తెలంగాణ
ఢిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తానని ప్రెస్‌మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి భారీ డైలాగులు కొట్టారు. కానీ కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులనే సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణంతో ఉన్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు కేంద్ర ప్రభుత్వం రూ.665 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అందులో 165 కోట్లను స్టేట్ హెడ్ ఎకౌంట్ లో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని చెల్లిస్తే ఆ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా వినియోగించుకోలేపోతుంది. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.165 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.112.49 కోట్లు రిలీజ్ చేస్తే కేంద్ర వాటా నిధులను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కేంద్ర వాటా రూ.165 కోట్లు, రాష్ట్ర షేర్ రూ.110 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ స్టేట్ షేర్ విడుదలకు ప్రభుత్వ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మొత్తం రూ.265 కోట్ల నిధులు అలాగే ఉండిపోయాయి.
కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రాంట్ (సీఆర్‌ఆర్ గ్రాంట్) రూపంలో రూ.150 కోట్లు, మెయింటనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రాంట్ (ఎంఆర్‌ఆర్ గ్రాంట్) రూపంలో రూ.350 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ నిధులు రావాలంటే పీఎంజేఎస్‌వైలో రాష్ట్ర వాటా రూ.110 కోట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు స్టేట్ గ్రాంట్ రూపంలో ఇంకో రూ.150 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల కోసం మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.665 కోట్లు ఇస్తుంది. మొత్తం కలిపితే రూ.925 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అధ్వనంగా ఉన్న రోడ్ల రిపేర్లు చేపట్టడంతో పాటు కొత్త రోడ్లను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వాటా నిధులిస్తే కేంద్రం నుంచి గ్రాంట్ రిలీజ్ అవుతుందని పేర్కొంటూ నెల రోజుల క్రితమే ప్రపోజల్స్ రెడీ చేశారు. నెల రోజులుగా ఆ ఫైల్ కు మోక్షం కలుగలేదు. తమ నియోజకవర్గంలోని రోడ్లకు రిపేర్లు చేయాలని, కొత్త రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిధులు అందుబాటులో ఉండి కూడా సద్వినియోగం చేసుకోకపోవడం ఏమిటా అని ప్రభుత్వవర్గాల్లోంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. గ్రాంట్లను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నోరు తెరిస్తే మూసీ పునరుజ్జీవం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెస్తానని అంటున్నారని, కేంద్రం గ్రాంట్ గా ఇచ్చే నిధులకు స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలని నెల రోజుల క్రితమే ప్రపోజల్స్ పంపినా రూ.260 కోట్ల విడుదలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో గ్రామాలకు వెళ్తే రోడ్ల కోసం ప్రజలు నిలదీస్తున్నారని, వాళ్లకు ఎన్నో హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు ఒక్క పని చేయలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గ్రామీణ రోడ్లను బాగు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్థితి ఉండదని.. ప్రభుత్వం ఇకనైనా తేరుకోకపోతే నిండా మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి రూ.1.50 లక్షల కోట్లు ఉంటాయి.. కానీ గ్రామాల్లోని రోడ్లను బాగు చేయడానికి నిధులు ఖర్చు చేయరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని గుర్తించకపోతే దెబ్బతింటామని చెప్తున్నారు.