Telugu Global
Editor's Choice

ఉనికిలో లేని 'కేశవపురం' కాంట్రాక్టు రద్దు

రూ.2 వేల కోట్లు ఆదా చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం

ఉనికిలో లేని కేశవపురం కాంట్రాక్టు రద్దు
X

సుంకిశాల డ్రికింగ్‌ వాటర్‌ స్కీం రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయి ఆ ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీపై నేరుగా చర్యలు తీసుకోవడానికి ఇష్టపడని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉనికిలో లేని ఒక ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సుంకిశాల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాల్సింది పోయి కొత్తగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ఏమిటన్న విమర్శలకు డొంక తిరుగుడుగా జవాబు చెప్పే ప్రయత్నం చేసింది. కేశవపురం రిజర్వాయర్‌ పనుల కాంట్రాక్టు రద్దు చేస్తున్నమని పేర్కొంటూ సీఎంవో నుంచి మీడియాకు లీకులు ఇచ్చి హడావిడి చేసింది. కేశవపురం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ మినహా ఇంకేరకంగానూ అది ఉనికిలో లేదు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు రేవంత్‌ సర్కార్‌ ప్రకటించింది. తద్వారా ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టులు మేఘాకు కట్టబెడుతూనే.. కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ భవిష్యత్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలించే నీటితో రెండు డెడికేటెడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ రిజర్వాయర్లు నిర్మించాలని అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. రాచకొండ రిజర్వాయర్‌ లో కృష్ణా జలాలు, కేశవపురం రిజర్వాయర్‌ లో గోదావరి జలాలు నిల్వ చేసి ఎట్ట పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ కు తాగునీటి ఇక్కట్లు రాకుండా చూస్తామని ప్రకటించింది.

హైదరాబాద్‌ కు అత్యంత సమీపంలో భూసేకరణ భారంగా మారడం, ఇతర కారణాలతో రాచకొండ, కేశవపురం రిజర్వాయర్ల నిర్మాణాలను కేసీఆర్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. రాచకొండ రిజర్వాయర్‌ ను ప్రతిపాదనల దశలోనే పక్కన పెట్టగా, కేశవరపురం రిజర్వాయర్‌ కు పరిపాలన అనుమతులు ఇచ్చి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక పక్కన పెట్టేసింది. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి శామీర్‌ పేట చెరువు మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన నుంచి హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ కు గోదావరి జలాలు తరలించి మూసీ నదిని పునరుజ్జీవం చేయాలని సంకల్పించింది. రాచకొండ రిజర్వాయర్‌ కు బదులుగా నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి సుంకిశాల డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టును తలపెట్టింది. సుంకిశాల డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టులు కొనసాగుతుండగా, కొండపోచమ్మసాగర్‌ నుంచి నీటిని తరలించే పనులను రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత రద్దు చేశారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి మూసీకి నీటిని తరలించే ప్రాజెక్టుకు రూ.1,100 కోట్లు ఖర్చవుతుండగా, దానికి బదులుగా మల్లన్నసాగర్‌ నుంచి ట్రంక్‌ లైన్‌, ఇతర ఖర్చుల పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.6 వేల కోట్లకు పెంచేశారు. మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టుకు ఇదివరకే పరిపాలన అనుమతులు ఇవ్వగా టెండర్ల దశలో ఉంది.

సుంకిశాల డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ కంపెనీ నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. అది కూలిన సమయం షిఫ్ట్‌ చేజింగ్‌ టైమ్‌ కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల వరకు ఈ విషయం బయటికి పొక్కకుండా రేవంత్‌ ప్రభుత్వం జాగ్రత్త పడింది. సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరే మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఉండటం.. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి అపవాదు రాకుండా చూసుకోవడంలో భాగంగానే సుంకిశాల ప్రమాదం ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా మేఘా సంస్థ నిర్లక్ష్యమే కారణమని నివేదిక ఇచ్చారు. మేఘా సంస్థను బ్లాక్‌ లిస్ట్‌ చేయాలని ఆ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేఘాతో సీఎం రేవంత్‌ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌ చేయలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ సహా పలు నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే కొడంగల్‌ లిఫ్ట్‌ స్కీం పనులను మేఘాకే కట్టబెట్టారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే పలు ప్రాజెక్టులు ఆ సంస్థకే ఇచ్చేలా ప్రభుత్వ పెద్దలు ఒప్పందం చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. మేఘాపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ఆ సంస్థ కొనసాగిస్తున్న పనులను కాకుండా అసలు ఉనికిలోనే లేని పనులను రద్దు చేసి 'చర్యలు' తీసుకున్నాం చూడండి అని సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుంకిశాల కాంట్రాక్టు రద్దు చేయడమో.. కొడంగల్‌ లిఫ్ట్‌ పనుల నుంచి మేఘాను తప్పించడమో చేయాలి.. కానీ కేసీఆర్‌ కోల్డ్‌ స్టోరేజీలో పెట్టిన కేశవపురం రద్దు చేస్తే ఆ సంస్థకు వచ్చే నష్టమేమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.



First Published:  6 Nov 2024 5:38 PM IST
Next Story