Telugu Global
Editor's Choice

కేబినెట్‌ విస్తరణ.. హైకమాండ్‌ చాయిస్‌

రేపు ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్‌ కు కాంగ్రెస్‌ పెద్దల ఆదేశం

కేబినెట్‌ విస్తరణ.. హైకమాండ్‌ చాయిస్‌
X

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 8న హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆలోపే తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించినట్టుగా కాంగ్రెస్‌ ముఖ్యుల మధ్య చర్చ జరుగుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కు సానుకూల ఫలితాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్తుండటంతో ఫలితాల తర్వాత పార్టీ హైకమాండ్‌ ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే ఆది, సోమవారాల్లోనే తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు. తెలంగాణ కేబినెట్‌ లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల భర్తీకి ఈసారి గ్రీన్‌ సిగ్నల్‌ దక్కుతుందని తెలుస్తోంది. గతంలో కేబినెట్‌ లో ఎవరెవరిని తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు కీలక నేతల అభిప్రాయాలు కోరిన పార్టీ హైకమాండ్‌.. ఈసారి తాము చెప్పబోయే వ్యక్తులను మాత్రమే కేబినెట్‌ లోకి తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇవ్వనుంది. ఇప్పటికే హైకమాండ్‌ పెద్దలు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో నిర్ణయానికి వచ్చారని, వారి పేర్లతో కూడిన జాబితాను సీఎం, డిప్యూటీ సీఎం చేతుల్లో పెడతారని తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల తరలింపు వివాదంపై చర్చించేందుకు సోమవారమే సీఎం రేవంత్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన పార్టీ హైకమాండ్‌ పెద్దలు దూకుడు తగ్గించుకోవాలని రేవంత్‌ కు చెప్పి పంపించారు. వారం రోజుల వ్యవధిలోనే రేవంత్‌ ను మళ్లీ ఢిల్లీకి రావాలని సూచించారు.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 24వ సారి. పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లు వ్యతిరేకించినా కీలక నేత రాహుల్‌ గాంధీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఆయననే సీఎం చేశారు. రేవంత్‌ సీఎం అయిన కొత్తలో రాహుల్‌ కూడా ఆయనతో సఖ్యతగా ఉండేవారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత క్రమేణ రేవంత్‌ ను దూరం పెట్టడం మొదలు పెట్టారు. హైడ్రా విషయంలో రేవంత్‌ దూకుడు తగ్గించుకోవాలని స్వయంగా రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. అయినా రేవంత్‌ తీరులో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటేరీ కేసీ వేణుగోపాల్ ద్వారా ఢిల్లీకి పిలిపించి తాను చెప్పాల్సిన ముచ్చట చెప్పి పంపించారు. బుల్డోజర్‌ రాజ్‌ గా పేరు తెచ్చుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కు సమస్యలు వస్తాయని హెచ్చరించారు. రేవంత్‌, భట్టి ప్రస్తుత టూర్‌ లో రాహుల్‌ గాంధీతోనూ సమావేశం ఉంటుందని చెప్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపైనా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారని సమాచారం. హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల తరలింపు, మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయిలో భారీ అక్రమాలు జరుగుతున్నట్టుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసి పై చేయి సాధించడం, ఫోర్త్‌ సిటీ పేరుతో రేవంత్‌ సోదరులు, సన్నిహితులు సాగిస్తున్న భూదందాలపైనా రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పెద్దలు ప్రశ్నించే అవకాశమున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుత సమావేశానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కూడా పిలుపు వచ్చే అవకాశముందని పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. సోమవారం సాయంత్రానికి తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై పార్టీ హైకమాండ్‌ స్టాండ్‌ ఏమిటో స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెప్తున్నారు.

First Published:  5 Oct 2024 2:05 PM GMT
Next Story