బై"డెన్' వైఫల్యాలే ట్రంప్ గెలుపు మంత్ర
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలువడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. ముఖ్యంగా బైడెన్ పాలనలోని లోపాలు ఆయనకు కలిసి వచ్చాయి. ధరల పెరుగుదలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ గెలుపునకు దగ్గర ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకరకంగా మొదటి స్థానంలో నిలిచిన అంశం క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థ. బైడెన్ ప్రభుత్వ హయాంలో అమెరికా గత నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి అత్యధిక ద్రవ్యోల్బణాన్నినమోదు చేసింది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కిదిద్దుతాననిభరోసా కల్పించారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై చర్చించాల్సి వచ్చినప్పుడు కమలా హారిస్‌తో అంత సౌకర్యవంతంగా కనిపించేవారు కాదు. ఈ అంశంపై ప్రజలకు ఆమె ఇబ్బంది పడేవారు. ఇవి ఆమెకు వ్యతిరేకంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిపోయిన వలసలను అరికడుతానన్న ట్రంప్ హామీని ఓటర్లు విశ్వసించారు. దీనికితోడు బైడెన్ పాలన కంటే ట్రంప్ పాలన బాగున్నదని ఓటర్లు విశ్వసించారు. అలాగే రెండు సార్లు జరిగిన హత్యాయత్నంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి కలిగింది. గత నాలుగేళ్ల లో జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యవహారశైలి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా మారింది. 80 ఏళ్లు దాటిని బైడెన్ సరిగా పనిచేయలేదని అమెరికన్లు భావించారు. వయసు సమస్యలతో కొన్నిసార్లు ఆయన వ్యవహరించిన తీరుపై బహిరంగంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ప్రసంగాలు, చర్చల్లో తడబడటం ఆపార్టీకి వ్యతిరేకంగా మారాయి. ఫలితంగా సొంత పార్టీలోనే ఆయనను మార్చాలనే డిమాండ్ వచ్చింది. బైడెన్ అభ్యర్థిగా ఉంటే ఓటమి తప్పదని డెమోక్రటిక్ పార్టీ ఆయనన మార్చింది. ఆయన తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థికలో జరిగిన గందరగోళం కూడా ఓటమికి కారణం.
గెలిచిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ..'అందరికీ ధన్యవాదాలు. మీరంతా నా మిత్రులు. ఈ ఉద్యమంలో వేలమంది మిత్రులున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి ఉద్యమాన్ని ఎవరూ చూడలేదు. చాలా గొప్ప రాజకీయ ఉద్యమాల్లో ఇదొకటి అని నేను భావిస్తున్నాను. ఈ దేశంలో ఇప్పటివరకు ఇలాంటిది జరగలేదు. భవిష్యత్తులోనూ జరగకపోవచ్చు. ఈ ఉద్యమం మరోస్థాయికి చేరుకోబోతున్నది. ఎందుకంటే మనం మన దేశానికి సాయం చేయబోతున్నాం. మన దేశానికి చాలా అత్యవసరంగా సాయం అవసరం. మనం మన సరిహద్దులను ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన దేశానికి సంబంధించిన అన్నింటినీ సరిదిద్దుకుంటాం. ఒక కారణంతో ఈ రాత్రి మనం చరిత్ర సృష్టించాం.' అన్నారు.