Telugu Global
Editor's Choice

బుల్డోజర్లతో తొక్కించడమేనా ప్రజలు కోరుకున్న మార్పు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీనే కాదు సీఎం స్థాయిని దిగజార్చిన రేవంత్

బుల్డోజర్లతో తొక్కించడమేనా ప్రజలు కోరుకున్న మార్పు
X

సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవహారం ఎలా ఉన్నదంటే రెడ్డొచ్చే మొదలాయె అన్నట్లు ఉంటుంది. మూసీ సుందరీకరణ అన్న ఆయన ఇప్పుడు మాట మార్చి ప్రక్షాళన అనే కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. మూసీ కాలుష్యం కారణంగా పట్టణాలు, గ్రామాలు నాశనమౌతున్నాయని ఆయన గగ్గోలు పెట్టారు. 2004-2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా పనిచేశారు. అప్పుడు మూసీ మురుగు నీటి సంగతి ఏమో గాని, ఫోరైడ్‌ రక్కసిని పారద్రోలే చర్యలు కూడా చేపట్టలేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులు చేపడుతూనే.. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది. ఫలితంగా నల్గొండలో చాలా గ్రామాలు ఫ్లోరైడ్‌ రహితంగా మారాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదికలు వెల్లడించాయి. ప్రభుత్వాలకు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని పదేళ్ల పాలన ద్వారా స్పష్టమైంది.

కానీ సీఎం రేవంత్‌ మాత్రం అడ్డోగులు హామీలు ఇచ్చి, అడ్డదిడ్డంగా మాట్లాడి ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. రాష్ట్రంలో రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ కు ఏ సమస్యలు కనిపించడం లేదు. హైడ్రా, మూసీ ఇవే తమ ప్రభుత్వ లక్ష్యమన్నంటు నిత్యం ముఖ్యమంత్రి అదే ముచ్చట చెబుతున్నారు. నిజానికి మూసీ సుందరీకరణ (సీఎం మాట మార్చినట్టు ప్రక్షాళన)ను ఎవరూ వ్యతిరేకించడం లేదు. దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయాలని, అది గత ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రక్రియ మొదలైందని దానికి కొనొసాగింపుగా ఏం చేయాలో అది చేస్తే సరిపోతుందని బీఆర్‌ఎస్‌ నేతలే కాదు, బీజేపీ నేతలూ, చివరికి కాంగ్రెస్‌లోని కొంతమంది నేతలూ అదే మాట చెబుతున్నారు. ముందుగా మూసీలోకి వెళ్లే మురుగునీటి శుద్ధికరణ, తర్వాత సుందరీకరణ చేపట్టాలని సూచిస్తున్నారు. కానీ సీఎం రేవంత్‌ మాత్రం బుల్డోజర్‌ ద్వారానే మూసీ ప్రక్షాళన సాధ్యమంటున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ నేతల మాదిరిగా గారడీ చేయడం మాకు రాదనడం హాస్యాస్పదంగా ఉన్నది. ఆరు గ్యారెంటీల గురించే కాదు మూసీ గురించే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే గారడీ ఎవరు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి గాయి గాయి ఎవరు అవుతున్నారో ప్రజలకు అర్థమైంది. మూసీ ప్రక్షాళన పేరుతో మార్కింగ్‌ చేసిన ప్రాంతాలకు వెళ్తే ముఖ్యమంత్రి అక్కడి బాధితులు ఏం చెబుతారో, ఆయన మాటలకు విలువ ఎంత ఉన్నదో తెలుస్తుంది.

మూసీ ప్రక్షాళన, బుల్డోజర్‌కు ఎవరూ అడ్డొచ్చినా లెక్క చేయం. ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిశ్చయించుకున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం చేసేది సున్నా హడావుడి ఎక్కువ అన్నది మూసీపై ప్రభుత్వ చర్యలు చూసిన వారికి అర్థమైంది. హైడ్రా పేరుతో బుల్డోజర్‌ కూల్చివేతలపై హైకోర్టు ఏం చెప్పిందో కూడా సీఎం తెలుసుకుంటే మంచిది. బీజేపీ రాష్ట్రాల్లోని బుల్డోజర్‌ న్యాయంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్లమెంటు, కోర్టుల్లో విమర్శిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్‌ మాత్రం కాషాయపార్టీ లైన్‌లోనే వెళ్తామని అంటున్నారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సీఎం తీసుకుంటున్న విధానాలన్నీ ఆ పార్టీ అధిష్టాన ఆలోచనలకు విరుద్ధంగా ఉంటున్నాయి కేసులు, అరెస్టులు, కమిటీల పేరుతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమిటి అని జనాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. పైగా మార్పు తెస్తామన్న కాంగ్రెస్‌ పాలన చూసి ఓట్లేసిన వారే వద్దు బాబోయి ఈ పాలన అనే స్థితికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ మార్కు పాలన చూసిన జనాలు మార్పు వద్దు, మీరూ వద్దు అంటున్నారు. ఇది ఏ ఒక్క వర్గం నుంచో వ్యక్తమౌతున్న అభిప్రాయం కాదు.. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల వాదన ఇదే.


First Published:  8 Nov 2024 10:00 PM IST
Next Story