Telugu Global
Editor's Choice

ఆ పది నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధం చేసే పనిలో గులాబీ పార్టీ

ఆ పది నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌
X

ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మిన వారిని ఆయన నట్టేట ముంచారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అనేది కనిపించదని బీరాలు పలికిన ముఖ్యమంత్రి యూటర్న్‌ తీసుకున్నారు. పీఏసీలో మూడు పదవులకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు నామినేషన్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా మూడు పదవులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ముగ్గురిలో ఎవరికి పీఏసీ ఛైర్మన్‌ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయం మేరకు స్పీకర్‌ ఎంపిక చేయాలి. వీరు ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి నామినేషన్‌ వేస్తే ఓటింగ్‌ నిర్వహించాలి. కానీ బీఆర్ఎస్‌ తరఫున నామినేషనే వేయని అరికెపూడి గాంధీకి అధికారపార్టీ పీఏసీ ఛైర్మన్‌ కట్టబెట్టింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇచ్చిన పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత ఆగమేఘాల మీద అధికారపార్టీ అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టడంపై బీఆర్‌ఎస్‌ ఫైర్‌ అయ్యింది. పీఏసీ మొదటి సమావేశంలోనే దీనిపై మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్‌ఎస్‌ సభ్యులు నిలదీశారు. దీనికి స్పష్టమైన సమాధానం చెప్పని మంత్రి స్పీకర్‌ విచక్షణాధికారం అంటూ దాటవేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సీఎం, మంత్రులు ప్లేటు ఫిరాయించినట్లు కనబడుతున్నది. విపక్షానికే పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చామని సీఎం రేవంత్‌, అరికెపూడి కౌశిక్‌రెడ్డిల సవాళ్లపై స్పందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు విపక్ష ఎమ్మెల్యేల గొడవతో మాకేమీ సంబంధమని వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పని రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది.

ఈ నేపథ్యంలోనే ఫిరాయించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పది నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలను, శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆ దిశగా నేతలు సన్నద్ధం చేస్తున్నది. ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నది. పది నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విడివిడిగా భేటీ కానున్నారు. మొదటగా ఇవాళ శేర్‌లింగంపల్లితో ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో భేటీ అయి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలు, ఉప ఎన్నిక సన్నద్ధత తదితర అంశాలను వారికి వివరించనున్నారు. అనంతరం మిగిలిన నియోజకవర్గాల ముఖ్య నేతలతోనూ కేటీఆర్‌ సమావేశం కానున్నారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధం చేసే పనిలో గులాబీ పార్టీ ఉన్నది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు వివిధ సందర్భాల్లో పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారిపై అసెంబ్లీ స్పీకర్‌ వద్ద బీఆర్ఎస్‌ పిటిషన్లు దాఖలు చేసింది. న్యా యపరంగానూ పోరాటం చేస్తున్నది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ల విచారణ కు సంబంధించి నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ ఇవ్వాలని శాసనసభ కార్యదర్శికి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల అనంతరం జరగబోయే పరిణామాలను బేరీజు వేసుకుంటున్న గులాబీ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి వాదిస్తున్నది. ఈ నేపథ్యంలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమంటున్నది. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు, శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం దృష్టి సారించింది. ఫిరాయింపు ఎమ్మెల్యే వెంట కొంతమంది నేతలు వెళ్లారు. మిగిలిన నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా వారందరినీ సమన్వయం చేసి కార్యక్రమాలు రూపొందించుకోవడానికి సిద్ధమౌతున్నది. కేటీఆర్‌ ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది నేతలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో భేటీ అయ్యారు. త్వరలోనే నియోజకవర్గంలోనే విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

First Published:  24 Sept 2024 11:36 AM IST
Next Story