Telugu Global
Editor's Choice

కాంగ్రెస్‌ మునిగి.. ఆప్‌ను ముంచి

1998 నుంచి బలం పెంచుకుంటూ 27 ఏళ్ల అధికారంలోకి వచ్చిన బీజేపీ

కాంగ్రెస్‌ మునిగి.. ఆప్‌ను ముంచి
X

ఢిల్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. ఆప్‌ స్వయంకృతం అంటున్నారు. కానీ కాంగ్రెస్‌ 1998 నుంచి 2013 వరకు విజయవంతంగా మూడుసార్లు గెలిచిన ఆ పార్టీ ఎలా పతనమైందో ఈ గణాంకాలే వెల్లడిస్తున్నారు. 1998లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 52 స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. బీజేపీని 15 స్థానాలకే పరిమితం చేసింది. ఆ తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ 47 స్థానాలు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 20 మాత్రమే గెలుచుకోగలిగింది. 2008లో హస్తం పార్టీ తన హవాను కొనసాగించింది. 43 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి మూడోసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీకి 23 స్థానాలు గెలుచుకున్నది. హ్యాట్రిక్‌ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ 2013 ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 32 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆప్‌కు మద్దతు ఇచ్చి ఢిల్లీలో ప్రాంతీయపార్టీకి కట్టబెట్టింది.

ఆప్‌ను నిలబెట్టిన హస్తం పార్టీనే మద్దతు ఉపసంహరించుకోవడంతో 2015లో ఎన్నికలకు కాంగ్రెస్‌ తెరలేపింది. దీంతో కేజ్రీవాల్‌ పాలనా విధానాలపై ప్రజల్లో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో 2015 లో 70 స్థానాల్లో ఏకంగా 67 స్థానాలను చేజిక్కించుకున్నది. బీజేపీ 3 స్థానాలకు పరిమితమైతే కాంగ్రెస్‌ ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆప్‌ తన ప్రభంజనాన్ని కొనసాగించింది. ఆప్‌ 62 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 8 స్థానాలను మాత్రమే దక్కించుకున్నది. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు జీరో. ఈ ఫలితాల తర్వాతనే దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్న ఆప్‌ కన్వీనర్‌ చాపకింద నీరులా కాంగ్రెస్‌, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాలనే టార్గెట్‌ చేశారు. 2015-2020 మధ్య కాలంలో ఢిల్లీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూపెట్టి గోవా, ఉత్తరాఖండ్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో తన పార్టీ విస్తరణ ప్రయత్నాలు చేశారు. కొంతవరకు ప్రభావం చూపెట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారంలోకి వచ్చింది. తనను నిలబెట్టిన కాంగ్రెస్‌ను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో దెబ్బకొట్టింది ఆప్‌నే కావడం గమనార్హం. అందుకే కాంగ్రెస్‌ కు ఆప్‌ కంటగింపు అయింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల ఒత్తిడి మేరకు కలిసి పనిచేసింది. కానీ ఆప్‌ను మాత్రం టార్గెట్‌ చేసిందని తాజా ఫలితాలు చూస్తే తెలుస్తుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆప్‌కు షాక్‌కు గురి చేశాయి. ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గతంలో మోడీని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. "నన్ను ఓడించాలంటే మోడీ ఇంకో జన్మ ఎత్తాలి....ఢిల్లీకి ఓనర్ నేను ఈ ఢిల్లీని పాలించేది నేనే" అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు. అయితే ఆప్‌ తప్పిదం కొన్ని అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారపార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేసి తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత 48 స్థానాలతో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిది. ఢిల్లీ పెద్ద రాజకీయ మార్పునకు కారణమైంది. కాషాయ పార్టీ ఆప్‌ను 22 స్థానాలకే పరిమితం చేయడమే కాదు ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌, సోమ్‌నాథ్‌ భారతి, సౌరభ్‌ భరద్వాజ్‌ లాంటి నేతలు ఓడించింది. ఇక్కడ ఆప్‌ ఘోరంగా ఓడిపోయింది అనేకంటే కాంగ్రెస్‌ తాను ఓడి ఆప్‌ ఓడించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకోలేకపోయినా ఆప్‌ను గద్దె దించాలనే తమ లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ నేతలు ఫలితాల తర్వాత వ్యాఖ్యానించారు. అంటే మేము మొత్తానికే మునిగామనే దానికంటే ఆప్‌ను ఓడించామనే సంతృప్తి ఆ పార్టీ నేతల వ్యాఖ్యల్లో కనిపించింది.

First Published:  9 Feb 2025 2:59 PM IST
Next Story