యూట్యూబర్ బెహరా ప్రసాద్ అరెస్ట్
14 రోజుల రిమాండ్..చంచల్‌గూడ జైలుకు తరలింపు
సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్ బెహరా ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని యువతి తెలిపింది. షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని.. నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని పేర్కొన్నది. కొన్నిరోజుల తర్వాత మరో వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశామని, ఆ సమయంలో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.