Telugu Global
CRIME

ఆర్జీ కర్‌ జూనియర్‌ డాక్టర్‌ రేప్‌ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

తీర్పు వెలువరించిన కోల్‌కత ట్రయల్‌ కోర్టు

ఆర్జీ కర్‌ జూనియర్‌ డాక్టర్‌ రేప్‌ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
X

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచారం చేసిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ కు కోల్‌కతా ట్రయల్‌ కోర్టు యావజ్జీవ కఠిక కారాగార శిక్ష విధించింది. ఇప్పటికే ఈ కేసులో సంజయ్‌ రాయ్‌ ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాలు రాయ్‌ కు వ్యతిరేకంగా ఉండటంతో దోషిగా తేల్చిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. తన కుమారుడు నేరం చేసినట్టు రుజువైతే ఉరిశిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే సంజయ్‌ రాయ్‌ తల్లి మాలతి తేల్చిచెప్పారు. ట్రయల్‌ కోర్టు తీర్పుపై తాము పై కోర్టులో అప్పీల్‌ కు వెళ్లేది లేదని ఆయన సోదరి తెలిపారు. జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచారం కేసులో శిక్ష ఖరారు చేయడానికి ముందు జడ్జీ నిందితుడు సంజయ్‌ రాయ్‌ వాదన చెప్పుకోవడానికి అవకాశం కల్పించారు. సంజయ్‌ రాయ్‌ స్పందిస్తూ.. తాను నేరం చేయలేదని.. తనను అకారణంగానే ఈ కేసులో ఇరికించారని తెలిపారు. బలవంతంగా తనతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించారని.. తాను అమాయకుడినని, ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తానని తెలిపారు. తాను నేరం చేసి ఉంటే సంఘటన స్థలంలోనే అవి ఊడిపోయి ఉండేవని చెప్పారు.

సంజయ్‌ వాదన అనంతరం జడ్జి స్పందిస్తూ.. తన ముందు కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు, దస్త్రాలు ఉన్నాయని.. వాటిని పరిశీలించానని.. మూడు గంటల పాటు నిందితుడి వాదన కూడా విన్న తర్వాత దోషిగా తేల్చానని తెలిపారు. 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ డాక్టర్‌ ను అత్యాచారం చేసి హత్య చేశారు. మొదట స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో కోల్‌కత హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌గా నిర్దారించి చార్జిషీట్‌ దాఖలు చేశారు. బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్టుగా ప్రాసిక్యూషన్‌ చార్జిషీట్‌లో పేర్కొనలేదు. హాస్పిటల్‌ ఆవరణలోని సీసీ టీవీ కెమెరాలు, ఇతర టెక్నికల్‌ ఎవిడెన్స్‌ల ఆధారంగా ఘటన జరిగిన మరుసటి రోజే కోల్‌కతా పోలీసులు సంజయ్‌ రాయ్‌ ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అండర్‌ ట్రయల్‌ ఖైదీగా రాయ్‌ జైలులో ఉంటున్నారు.

First Published:  20 Jan 2025 3:11 PM IST
Next Story