ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
కరీంనగర్ కలెక్టరేట్ లో ఘటనపై కేసులు
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధత సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్ల కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఫిర్యాదు చేశారు. సమావేశాన్ని గందరగోళ పరిచి పక్కదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీవో ఫిర్యాదు చేశారు. తన పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కంప్లైంట్ చేశారు. ముగ్గురి ఫిర్యాదుల ఆధారంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడబోతుండగా కౌశిశ్ రెడ్డి ఆయనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రసాభాసకు దారితీశాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో పరస్పరం దాడి చేసుకున్నంత పని చేశారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని సమావేశం నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.