ప్రొఫెసర్ సాయిబాబాను నిర్బంధించిన వారిని శిక్షించాలి
సంస్మరణ సభలో వక్తల డిమాండ్
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అక్రమంగా పదేళ్ల పాటు నాగ్‌పూర్ జైళ్లోని అండాసెల్ లో నిర్బంధించిన కేంద్ర, రాష్ట్ర పాలకులు, పోలీస్ అధికారులను శిక్షించాలని వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో నిర్వహించిన ప్రొఫెసర్ సాయిబాబా సంతాప సభలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం వేణుగోపాల్, ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ తదితరులు ప్రసంగించారు. సాయిబాబా నిర్దోశి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, అలాంటప్పుడు ఆయనను అక్రమంగా జైళ్లో నిర్బంధించిన వారికి ఎలాంటి శిక్షలు వేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం లేవా.., పాలకులు తమ ఇష్టానుసారంగా అరెస్టు చేసి 10 ఏళ్ల పాటు జైల్లో నిర్భంధిస్తారా అన్ని ప్రశ్నించారు. చట్టాల లోపంతో సాయిబాబాను జైళ్లో నిర్బంధించారా లేక పాలకుల్లో మొదళ్లలో విషం నిండి ఈ పని చేశారా అని తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నేరం చేయని వారిని ఏళ్ల తరబడి జైళ్లలో నిర్భంధించే ఈ చట్టాలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని మండిపడ్డారు. బెయిల్ అనేది రూల్ అపి నేరం రుజువైతేనే జైలు అని ప్రఖ్యాత న్యాయ కోవిదులు జస్టిస్ వి.ఆర్ కృష్ణ అయ్యర్ వ్యాఖ్యలను చేశారు. మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర పాలకులు ఒక పౌర హక్కుల ఉద్యమకారుడి సంస్మరణ సభకు స్వచ్ఛందంగా ఎంత మంది వచ్చారో చూడాలన్నారు.
నేరస్తులు ఎన్నికల్లో గెలిచి దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. గుజరాత్ లో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన అమిత్ షా ఈ రోజు దేశానికి హోం మంత్రి అని, ప్రధాని మోదీపైనా నేరారోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి వారి పాలనలో దేశం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబా లాంటి వారు దేశ ద్రోహులైతే మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు కూడా ద్రోహులేనా అని ప్రశ్నించారు. దేశ ప్రజలపై యుద్ధం చేస్తోన్న అమిత్ షా మావోయిస్టులపై 80 శాతం విజయం సాధించామని చెప్పుకొని భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఎదురే లేదని విర్రవీగిన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారన్న వాస్తవం మర్చిపోవద్దన్నారు. పాలకుల ఆగడాలకు అంతం పలకాలంటే ఎర్రజెండాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ సాయిబాబా పోరాట స్ఫూర్తితో దండకారణ్యం నుంచి ఆదివాసీలను తరిమేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగర్ కు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని సభలో తీర్మానించారు. సంస్మరణ సభలో పౌర హక్కుల సంఘం, నిర్బంధ వ్యతిరేక వేదిక, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, పద్మకుమారి, మీనా కందస్వామి, ప్రొఫెసర్ హరగోపాల్, సాయిబాబా సహచరి వసంత, కూతురు, మంజీర తదితరులు పాల్గొన్నారు.