మా భూములు గుంజుకుంటున్నరు.. ఇవ్వనంటే దాడులు చేస్తున్నరు
నేషనల్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌లకు లగచర్ల బాధితుల ఫిర్యాదు
ఫార్మా కంపెనీల కోసం తమ జీవనాధారమైన భూములు గుంజుకుంటున్నారని... ఇవ్వమని అన్నందుకు తమ దాడులు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని లగచర్ల సమీప తండాల వాసులు సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి లగచర్ల బాధితులు ఢిల్లీలో ఆయా కమిషన్‌ల చైర్మన్లు, సభ్యులను కలిశారు. తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్, అధికారులపై దాడులు చేశారని ఆరోపిస్తూ తమ తండాల్లో అర్ధరాత్రి పూట కరెంట్ తీసేసి గడ్డపారలతో తలుపులు పగలగొట్టి పోలీసులు ఇండ్లలోకి చొరబడి మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారని వివరించారు. లగచర్ల బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ విజయభారతి, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా, ఎస్టీ కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, మహిళా కమిషన్ అధికారులను కలిసి తమను ఆదుకోవాలని విన్నవించారు. తాము భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు పోలీసులను ముందు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి మగవాళ్లను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారని తెలిపారు. దీంతో తాము బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వివరించారు. వారి వెంట సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, కోవా లక్ష్మీ, రవీందర్ కుమార్, హరిప్రియనాయక్, తుల ఉమ, రాంచందర్ నాయక్, రూప్ సింగ్ తదితరులు ఉన్నారు.