చెట్టును ఢీకొట్టి కాల్వలో ఎగిరి పడిన కారు.. ఏడుగురు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా శివంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. జిల్లాలోని పాముబండ తండా, రత్రాపూర్, తాళ్లపల్లికి చెందిన ఎనిమిది మంది కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అతి వేగంతో కారు నడుపుతూ శివంపేట సమీపంలోని ఉసిరికపల్లి వద్ద చెట్టును ఢీకొట్టాడు. దీంతో కారు అదుపుతప్పి పక్కన రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, పురుషుడు ఉన్నారు.
హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా శివంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం మృతుల కుటంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.