Telugu Global
CRIME

ప్రభుత్వం నుంచి సన్నీలియోని ఖాతాకు ప్రతినెల రూ. 1,000 జమ

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహతారీ వందన్‌ యోజన పథకంలో బాలీవుడ్‌ నటి పేరు ఉండటంపై అధికారులు షాక్‌

ప్రభుత్వం నుంచి సన్నీలియోని ఖాతాకు  ప్రతినెల రూ. 1,000 జమ
X

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోని పేరు ఉండటంతో అధికారులు షాక్‌ అయ్యారు. అంతేకాకుండా ఆమె పేరు మీద ఉన్న ఖాతాలోకి ప్రతినెల ప్రభుత్వం నుంచి రూ. 1,000 జమ అవుతున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు చేయగా అసలు విషయం బైటికి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహతారీ వందన్‌ యోజన పథకం కింద రాష్ట్రంలోని వివాహిత మహిళలకు ప్రతి నెలా వారి ఖాతాల్లో రూ. 1,000 జమ చేస్తుంటుంది. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్‌ నటి సన్నీలియోని పేరు ఓ ఖాతాలో ఉండటాన్ని గుర్తించారు. దీనిపై విచారణ చేయగా బస్తర్‌ ప్రాంతంలోని తాలూరు గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో నకిలీ ఖాతా తెరిచి .. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్‌ యోజన పథకానికి నమోదు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 100 పొందుతున్నాడని పేర్కొన్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. పథకంలో అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులనూ విచారిస్తున్నామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌. హరీశ్‌ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని సదరు బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో విపక్ష కాంగ్రెస్‌ అధికార బీజేపీపై విమర్శలు చేసింది. రాష్ట్రంలో మహతారీ వందన్‌ యోజన కింద ఉన్న 50 శాతం మంది లబ్ధిదారుల ఖాతాలు నకిలీవేనని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ దీపక్‌ బైజ్‌ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అరుణ్‌ సావో స్పందిస్తూ.. కాంగ్రెస్‌ గత హయాంలో అందించని సాయం ఇప్పుడు రాష్ట్ర మహిళలు అందుకుంటున్నందున ఆ పార్టీ తట్టుకోలేకపోతున్నదని మండిపడ్డారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

First Published:  23 Dec 2024 12:21 PM IST
Next Story