రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేయడంతో మంగళవారం ఆయన ప్రకాశం ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను విచారించిన పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా రాత్రి 7 గంటలకు ప్రకటించారు. 2021లో అప్పటి సీఎం జగన్ పై రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని రాఘురామ నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరులోని సీఐడీ ఆఫీస్ కు తరలించారు. అదే రోజు రాత్రి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి ప్రయత్నించారని ఈ ఏడాది జూలైలో రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ హెడ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ సహా పలవురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజయపాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని అక్టోబర్ ఒకటిన ఆదేశాలు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.