Telugu Global
CRIME

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఊరట

మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఊరట
X

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఊరట దక్కింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా వాళ్లు ఉంటున్న ఇల్లు, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్‌ 13 తేదీలోగా ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ.. ఈ జంట ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. దీనిపై నటి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. 2017లో జరిగిన 'గెయిన్‌ బిట్‌కాయన్‌ పోంజీ స్కీమ్‌'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఈడీ పరిధిలో లేని అంశం. అయినా ఈ కేసులో నిజానిజాలు బైటికి వచ్చేదాకా ఈడీ దర్యాప్తునకు వారు సహకరిస్తారని తెలిపారు.

కేసు ఏమిటి?

ముంబయికి చెందిన 'వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే సంస్థ 2017లో 'గెయిన్‌ బిట్‌కాయన్‌ పోంజీ స్కీమ్‌' ను నిర్వహించింది. దీనిలో భాగంగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపెట్టింది. మల్టీ -లెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ. 6,000 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బైటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

అయితే ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌ అయిన అమిత్‌ భరద్వాజ్‌ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొన్నది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతని దగ్గరే ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ. 150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

First Published:  11 Oct 2024 12:35 PM IST
Next Story