Telugu Global
CRIME

సిమ్‌ స్వాప్‌ చేసి.. రూ. 7.5 కోట్లు కొట్టేశారు

స్కామర్ల బారినపడ్డ ముంబయిలోని కందివాలీకి చెందిన ఓ వ్యాపారవేత్త

సిమ్‌ స్వాప్‌ చేసి.. రూ. 7.5 కోట్లు కొట్టేశారు
X

అమాయకుల నుంచి డబ్బులు కొట్టేయడానికి సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త పంథాల్ని అనుసరిస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఈ నేరగాళ్ల చేతికి చిక్కాడు. అతడి సిమ్‌ స్వాప్‌ చేసి, రూ. 7.5 కోట్లు కొట్టేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబయిలోని కందివాలీకి చెందిన ఓ వ్యాపారవేత్త తాజాగా స్కామర్ల బారినపడ్డారు. అతని ఖాతాలో ఉన్న రూ. కోట్లు దండుకుందామని స్కామర్లు ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్లుగానే సిమ్‌ స్వాప్‌ చేశారు. నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ను ట్రిక్‌ చేసి, టార్గెట్‌ చేసిన వ్యక్తి మొబైల్‌ నంబర్‌ను తమ వద్ద ఉన్న సిమ్‌ కార్డుకు లింక్‌ చేసి, బ్యాంక్‌ నుంచి వచ్చే ఓటీపీలను తెలుసుకోగలిగారు. తర్వాత ఖాతాలో డబ్బు ఖాళీ చేయడం ప్రారంభించారు. అయితే తన ఖాతా నుంచి అనుమానాస్పద విత్‌డ్రాలు గుర్తించిన యజమాని వెంటనే అప్రమత్తమయ్యారు.

సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 కాల్‌ చేసి, మోసం గురించి వివరించారు. దాంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ బ్యాంక్‌ నోడల్‌ అధికారులను సంప్రదించారు. అలాగే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తక్షణ స్పందనతో సైబర్‌ పోలీస్‌

టీమ్‌ రూ. 4.65 కోట్లను ఫ్రీజ్‌ చేసి, నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. అయితే మిగిలిన మొత్తం అప్పటికే స్కామర్ల చేతికి చిక్కింది. వారు ఆ సొమ్మును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి, విత్‌ డ్రా చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  25 Dec 2024 11:11 AM IST
Next Story