ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై అనుమానాలు
అన్నంలో విష ప్రయోగం జరిగినట్టు సమాచారం గుత్తి కోయల ఆరోపణ.. నిపుణులైన వైద్య బృందంతో శవ పరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్
ఏటూరు నాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ ఎన్ కౌంటర్ పై పై పలు అనుమానాలు ఉన్నాయనని ఆరోపించింది. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారని, ఈ సందర్భంలోనే ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్ కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీసు క్యాంపు ఏర్పాటు చేయాలని కోరడం, ఆపరేషన్ కగార్ ను తెలంగాణలో అమలుచేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. అడవిలో పోలీసు కూబింగ్ పేరుతో నిత్యం నిర్బంధాలను అమలుచేస్తూ.. ఎన్‌కౌంటర్‌పేరు కాల్చి చంపడానికి పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్ పాల్గొన్న పోలీసులపై హత్య నేరం నమోదు చేయాలని డిమాండ్ చేసింది.