పోర్న్ రాకెట్ కేసులో రాజ్‌కుంద్రా ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆఫీసులపైనా దృష్టి పెట్టిన దర్యాప్తు సంస్థ
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త,ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అశ్లీల మూవీల నిర్మాణం, ప్రసారం కేసులో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆవరణాలపైనా దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగాముంబై, ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.మొబైల్ అప్లికేషన్ ద్వారా అశ్లీల కంటెంట్ నిర్మాణం , పంపిణీకి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన మనీ-లాండరింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.పోర్న్ ప్రొడక్షన్‌కు సంబంధించి ఆరోపణలపై 2021లో కుంద్రాపై ఈడీ విచారణ చేస్తున్నది. 2021 జూలైలో ఇండియన్ పీనల్ కోడ్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రా అరెస్టు చేసింది. దాంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో కుంద్రా ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాఖలైన ఛార్జ్‌షీట్‌లో.. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి ఆయన పెద్దఎత్తున ఆర్జించినట్లు పేర్కొన్నారు.ఆ తర్వాత సిటీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్' పేరిట అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులోనూ రాజ్‌కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గతంలో కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిపై ఈడీ చర్యలు చేపట్టింది. వారికి చెందిన రూ. 97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూలోని ఓ నివాస ప్లాట్ శిల్పాశెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతోపాటు పూణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీద ఉన్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది.