విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం
అజ్మీర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 11 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. రాజేంద్రప్రసాద్ సహా 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
జ్యోత్స్న మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని సీఎం తెలిపారు. బస్సు ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. విజయవాడ నుంచి వెళ్లిన లాయర్ల బృందం రాజస్థాన్‌లో ప్రమాదానికి గురైంది. బాధితులకు సాయం అందించాలని రాజస్థాన్ సీఎం కోరారు.