బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్
మంజూరు చేసిన నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చింతల్‌బస్తీలోని డిస్పెన్సరీకి తరలించి కోవిడ్ పరీక్షలు చేయించారు. ఆ తర్వాత మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను తీసుకెళ్లారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎర్రోళ్లను అక్రమంగా అరెస్టు చేశారని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున పోలీసులు పోలీసులు అరెస్టు చేశారని ఆయన తరపు లాయర్ వాదించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ రావాలని ఇప్పటికే మూడుసార్లు పిలిచామని.. ఆయన సహకరించకపోవడంతోనే అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.