Telugu Global
CRIME

హత్య చేసి.. సూట్‌కేసులో కుక్కి

కొత్తగా అపార్ట్‌మెంట్‌ తీసుకున్నాం... ఛాయ్‌ తాగి చూద్దురు రండి అని పిలిచి హత్య

హత్య చేసి.. సూట్‌కేసులో కుక్కి
X

నెల్లూరు నగరం సంతపేట రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకున్నది. పరిచయస్తురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్‌ కేసులో కుక్కి.. పక్కరాష్ట్రం తమిళనాడులో పడేసేందుకు యత్నించిన తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు.కొత్తగా అపార్ట్‌మెంట్‌ తీసుకున్నాం... ఛాయ్‌ తాగి చూద్దురు రండి అని ఆ వృద్ధురాలిని ఇంటికి పిలిచారు. ఛాయ్‌ ఇచ్చారు. ఆమె టీ తాగుతుండగానే ఆ తండ్రీ, కూతురు దారుణానికి ఒడిగట్టారు. తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి చైన్నైకి తరలిస్తుండగా.. అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆ దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల సమాచారం ప్రకారం.... నెల్లూరు నగరం సంతపేట రాజేంద్రనగర్‌లో మణ్యం రమణి, మురుగేశం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. సోమవారం ఉదయం రమణి కూరగాయల కొనుగోలుకు సమీప దుకాణానికి వెళ్లారు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల తీవ్రంగా గాలించారు. లాభం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వారు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అనంతరం సంతపేట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఎస్‌ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి టెక్నాలజీ ఆధారంగా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ సమయంలోనే తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేసి సూట్‌కేసులో వృద్ధురాలి మృతదేహం ఉన్నదని, ఆ సూట్‌ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు బాలసుబ్రహ్మణం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించి ఇక్కడి పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీంజూరు రైల్వే పోలీసుల విచారణలో రమణిని హత్య చేసినట్లు చెప్పారు.

బంగారం కోసమే

గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఇంటిపై బంగారు నగలు దొంగిలించడానికి నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచారు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను హత్య చేసిన ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు.

First Published:  6 Nov 2024 6:19 AM GMT
Next Story